వైయస్ జగన్‌పై మీడియా ప్రతీకారం

వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి జగమంతా శత్రువులుగా మారిపోయారు. తన వెంట నడుస్తున్న బలం, బలగం ప్రత్యర్థులను ఢీకొట్టే స్థితిలో లేదు. గతంలో ఈనాడు రామోజీరావుపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరుగుతూ వచ్చిన సాక్షి మీడియా ఆత్మరక్షణలో పడిపోయిది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థించడానికి సాక్షి మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై, తెలుగుదేశం పార్టీపై ఎన్ని విమర్శలు చేస్తూ వార్తాకథనాలు ప్రచురిస్తున్నా పస లేకుండా పోయింది. సాక్షి వార్తాకథనాల్లో హేతుబద్దత, కార్యాకారణ సంబంధాల మేళవింపు లేకపోవడం పెద్ద లోపం. పైగా, జగన్‌ను సమర్థించుకోవడానికి దుమ్మెత్తిపోయడం, ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుందనే అభిప్రాయం ఉంది.
వైయస్ జగన్ సిబిఐ దర్యాప్తును ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలకే కాదు, సూర్య వంటి దినపత్రికకు బెల్లం దొరికినట్లయింది. సూర్య పత్రిక జగన్‌కు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాయడానికి ఒకడుగు ముందే ఉంటోంది. వైయస్ రాజకీయ సమాధి అంటూ తాజాగా శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జగన్ అరెస్టు ఖాయమంటూ వరుసగా రాస్తూ వస్తోంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక జగన్ వర్గంలో నిరాశానిస్పృహలు చోటు చేసుకున్నాయంటూ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈనాడు మాత్రం సిబిఐ దర్యాప్తునకు సంబంధించి వైయస్ జగన్ మీద ఎన్ని రకాలుగా ఆరోపణలు చేయడానికి వీలుందో అన్ని రకాలుగా చేస్తూ పోతోంది. సాక్షి మీడియా పని ఖతం అంటూ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వి. రాధాకృష్ణ ప్రచారం సాగిస్తున్నారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మొత్తం మీద, సాక్షి మీడియా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతోందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications