తెలంగాణపై సోనియా గాంధీ తేలుస్తారా?

Sonia Gandhi
తెలంగాణపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో ఉనికి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెసు పరిస్థితి అంతకన్నా దారుణంగా తయారు కావచ్చు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాత ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన ప్రక్రియకు చంద్రబాబు వైఖరి గానీ రాష్ట్రంలోని ఇతర పార్టీల వైఖరి గానీ అవసరం లేదు. తెలంగాణ అనుకూలంగా ప్రకటన చేస్తే సీమాంధ్రలోనే కాదు, తెలంగాణలోనూ తాము బలహీనపడుతామని కాంగ్రెసు అధిష్టానం భావిస్తూ వస్తున్నది. క్రెడిట్ కెసిఆర్ కొట్టేస్తారని, దానివల్ల వచ్చే ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయకపోతే కనీసం వచ్చే స్థానాలు కూడా కోల్పోతుంది.

సీమాంధ్రలో కూడా కాంగ్రెసు పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. అయితే, తెలుగుదేశం కన్నా కాస్తా మెరుగ్గా ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గాలి సీమాంధ్రలో వీస్తున్నది. ఏదో రకంగా జగన్‌ను దెబ్బ తీసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని రాజకీయంగా నిర్వీర్యం చేస్తే ఫలితం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తూ ఉండవచ్చు. కానీ, పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా ఇప్పుడే చెప్పలేని స్థితి. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే తాము అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలిచి కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని తెలంగాణ ప్రాంత నాయకులు హామీ ఇస్తున్నారు. అంత గొప్పగా సీట్లు రాకపోయినా తెరాసకు గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతుంది. రాష్ట్రం ఏర్పడితే, ఇప్పుడున్న క్యాడర్, దిగువ స్థాయి నాయకత్వం, ప్రజలు కెసిఆర్‌తో ఉంటారని గట్టిగా చెప్పలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కెసిఆర్, కోదండరామ్ ఆలంబనగా మాత్రమే ఉన్నారనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది.

ఆర్టీసి ఉద్యోగులు, వైద్యులు, ప్రభుత్వోద్యోగులు ఎవరు కూడా తెలంగాణ వచ్చే వరకు విధులకు వెళ్లే పరిస్థితి లేదు. వారు గట్టిగానే నిలబడ్డారు. వేతనాలు లేకుండా ఎంత కాలం నిలబడుతారనే ప్రభుత్వ దీమాను వారు పటాపంచలు చేస్తున్నారు. ప్రయాణాలకు ఇబ్బంది పడుతున్నామని ప్రజలు చెప్పడం లేదు. పైగా, సీమాంధ్రకు, తెలంగాణకు మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చాలనే శక్తుల పట్ల తెలంగాణ ఉద్యమ నాయకులు అప్రమత్తంగానే ఉన్నారని చెప్పాలి. పైగా, తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల మధ్య పకడ్బందీ సమన్వయం ఉంది. తమ వంతు పాత్రను నిర్వహించడానికి ఏ వర్గం కూడా వెనకాడడం లేదు. విధులను బహిష్కరిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. చెప్పాలంటే, సకల జనుల సమ్మె సకలం బందుగా మారింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గానీ తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. బహుశా, తర్వాతి కాలంలో అది హైదరాబాదును కూడా తాకితే పరిస్థితి మరింత విషమిస్తుంది. తెలంగాణపై మాయ మాటలు చెబుతూ మభ్యపెడుతున్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులను, తెలంగాణ ప్రజాప్రతినిధులను తెలంగాణ ప్రజలు లక్ష్యంగా చేసుకున్నారు. అలా లక్ష్యం చేసుకోవడానికి తెరాస, తెలంగాణ జెఎసి ఆలంబనగా నిలుస్తున్నది. ఆ ఆలంబన లేకపోతే, పార్లమెంటరీ రాజకీయాల్లోని ఓ వర్గం మద్దతు లేకపోతే తెలంగాణ ఇవాళ ఘోరంగా నెత్తురోడుతూ ఉండేది. ఆ ప్రమాదం నుంచి తెరాస, తెలంగాణ జెఎసి కాపాడుతున్నాయి.

తెలంగాణపై ఓ స్పష్టమైన వైఖరిని తీసుకుని లాభాన్నో, నష్టాన్నో భరించాల్సిన మొదటి పార్టీ కాంగ్రెసు. సీమాంధ్రలో మద్దుతు కోల్పోతామనే ఉద్దేశంతో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో పార్టీ ఉనికికే ప్రమాదం. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోయినా, తెలంగాణపై తేల్చుకున్నా కాంగ్రెసు తెలంగాణలో నష్టపోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నది. తెలంగాణ వచ్చినా, రాకున్నా తెలుగుదేశం కోలుకునే పరిస్థితి లేదు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలోని పార్టీ దాదాపుగా ఖాళీ కావచ్చు. తెలుగుదేశం ఇప్పటికే ఖాళీ అవుతూ వస్తున్నది. దానివల్లనే ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. బహుశా, తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో కాంగ్రెసు అధిష్టానం జాప్యం చేయకపోవచ్చు. పార్టీపరంగా సంప్రదింపులు ప్రక్రియను కాంగ్రెసు పూర్తి చేసింది కాబట్టి త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+