జగన్ 'స్కీము'లు: మంత్రుల తోడ్పాటు?

ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న మంత్రులు కూడా జగన్ వర్గానికి ఉడతా భక్తిగా సహాయపడుతున్నారు. కిరణ్‌పై విరుచుకు పడే మంత్రి శంకర్ రావు, రూపాయి కిలో బియ్యం పథకానికి తాను వ్యతిరేకమన్న డిఎల్ రవీంద్రా రెడ్డి, రాజీవ్ యువకిరణాలు, 108 నిర్వీర్యంపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిలదీసిన బొత్స సత్యనారాయణ తదితరులు వారికి బాగా ఉపయోపడుతున్నారు. మిగతా పార్టీలు వారిని ఉదాహరణగా చూపి సిఎంను విమర్శిస్తున్నప్పటికీ, వైయస్ పథకాలు నిర్వీర్యం అవుతున్నాయనడానికి కేబినెట్ మంత్రుల వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పుకోవడానికి జగన్ వర్గానికి మరింత అవకాశం కలుగుతోంది.
108, 104, పెన్షన్లు ఇలా తదితర పథకాలు అమలు కావడం లేదంటూ జగన్ విమర్శలు చేశారు, చేస్తున్నారు. తాజాగా వైయస్ సింగిల్ బల్పు పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతోందంటూ ఆయన పత్రిక ఆరోపణలు చేసింది. ప్రభుత్వ పథకాలే లక్ష్యంగా చేసుకున్న జగన్, ఆయన వర్గం అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ తాము అధికారంలోకి వస్తే ఏమేమీ చేస్తామో ప్రజలకు వివరించే పనిలో పడ్డారు. అందుకే వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలు అమలు కావాలంటే జగన్ వల్లే సాధ్యమంటూ చెబుతూ వస్తోంది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో జగన్ వర్గం ఎంపీ మేకపాటి అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే దళితులకు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ ప్రకటన చేశారు. మరి వారి 'స్కీమ్స్' ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications