జగన్ కోసం: వైయస్ ఆబగా దోచేశారా!?

YS Rajasekhar Reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రేపన్నదే లేనట్లుగా భూములను కబళించారా? అంటే ఈడి న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ అవుననే అంటోందట! వైయస్ తన హయాంలో రేపన్నదే లేనట్లుగా భూములను కబళించారని, దురాశతో, అసాధారణ వేగంతో భూదోపిడీకి పాల్పడ్డారని ఈడి న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. కథనం ప్రకారం...

"భూముల కేటాయింపులు జరిగిన తేదీలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తేదీలను చూస్తే వాటిని పెట్టుబడులు అని కాకుండా లంచాలు అని నిర్థారించవచ్చు. పెట్టుబడుల రూపంలో చెల్లించినవన్నీ లంచాలే''- అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. రేపన్నదే లేదన్నట్లు.. ఆబగా.. దురాశతో భూములను కబళించారని తప్పుబట్టిన ధర్మాసనం.. ఈ అక్రమాలన్నిటికీ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని తేల్చింది.

తన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కి వైయస్ ప్రభుత్వం అరబిందో ఫార్మా, హెటిరో గ్రూప్ కంపెనీలకు అక్రమంగా లబ్ధి చేకూర్చిందని జగన్ అక్రమాస్తుల కేసులో తొలి జప్తుపై ఇచ్చిన తీర్పులో న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. జగన్‌కు, ఆయన ఆధ్వర్యంలోని కంపెనీలకు నిధులను రాబట్టేందుకే వైయస్ సర్కారు అడ్డగోలుగా నిర్ణయాలను తీసుకుందని తేల్చి చెప్పింది.

వైయస్ చేసిన ఈ అక్రమాలన్నీ అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తాయని ధర్మాసనం చైర్మన్ పికె మిశ్రా, సభ్యులు ఎస్‌కె శర్మ, కె.రామ్మూర్తిలతో కూడిన పూర్తిస్థాయి ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తులు, ఎమార్ ప్రాపర్టీస్ అక్రమాలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాల మేరకు నల్ల ధనం చెలామణీ నిరోధక చట్టం కింద ఈడి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఎమార్ ప్రాపర్టీస్‌కు చెందిన రూ.71 కోట్లు, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాకు చెందిన రూ.51 కోట్ల ఆస్తుల జప్తునకు ఉపక్రమించింది కూడా. ఆస్తుల స్వాధీనానికి అనుమతి కోరుతూ దాఖలైన కేసుల్లో న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థలో సుదీర్ఘ వాద ప్రతివాదాలు జరిగాయి. ఈ రెండు కేసుల్లో నల్ల ధనం చెలామణీ జరిగినట్లు నిర్థారించిన ధర్మాసనం.. ఈడి విజ్ఞప్తి మేరకు అన్ని సంస్థల ఆస్తుల జప్తునకు ఆమోద ముద్ర వేస్తూ బుధవారం తీర్పు చెప్పింది.

'ఈ నేల భగవంతుడికి చెందుతుంది. కానీ, మానవులు అత్యంత దురాశతో నిరంతరం ఈ నేలను కబళించేందుకు చూస్తారు' అంటూ తన ఉత్తర్వు శీర్షికలోనే వ్యాఖ్యానించిన సంస్థ చైర్మన్ పికె మిశ్రా.. తీర్పులో అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం కొంప మునిగిందన్నట్లు అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్‌కు భూ కేటాయింపు లేఖలను ఒకేరోజు జారీ చేశారని అప్పటి ఎపిఐఐసి ఎండి బిపి ఆచార్యను ప్రశ్నించారు. వార్తా పత్రికల ద్వారా దరఖాస్తులు ఆహ్వానించకుండా భూములను కేటాయించడమే పెద్ద కుట్రగా అభివర్ణించారు.

అప్పటి ముఖ్యమంత్రి వైయస్ ప్రోద్బలం వల్లనే అన్ని నిబంధనలను ఉల్లంఘించి భూ కేటాయింపులు చేశారని చెప్పారు. భారతీయ శిక్షా స్మృతి, అవినీతి నిరోధక చట్టం కింద నిర్థారించదగ్గ అనేక నేరాలకు అప్పటి ముఖ్యమంత్రి, అధికారులు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. ధరల నిర్ణాయక కమిటీ సవరించిన రేటు ఎకరానికి రూ.23.36 లక్షలు అయితే ఏ ఆధారంపై ఎకరాన్ని రూ.7 లక్షల చొప్పున నిర్థారించారని ప్రశ్నించారు.

"ముఖ్యమంత్రే ఈ రేటుకు భూములను కేటాయించాలని చెప్పినట్లు ఎపిఐఐసి ఎండి, వైస్ చైర్మన్ బిపి ఆచార్య మౌఖికంగా ప్రాజెక్ట్స్ అధికారి టిఎల్ రామచంద్రన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏమైనా భూముల విలువను నిర్ణయించే అధికారి బాధ్యతను తీసుకున్నారా? అరబిందో, హెటిరోలు భారీ ఎత్తున భూమిని కబళించాలనే తొందరపాటును ఎందుకు ప్రదర్శించాయో నాకు అర్థం కావటం లేదు. ఇవ్వాళ కబళించకపోతే రేపనేదే రానట్లుగా వారు ఆ భూముల స్వాధీనానికి ఎగబడ్డారు. రాముడు మంచి బాలుడు అన్నట్లు వ్యవహరించి ఎపిఐఐసి అధికారులు ఈ దోపిడీకి పూర్తి సహకారాన్ని అందించారు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

"ధరల నిర్ణాయక కమిటీ నిర్ణయించిన రేటు కంటే అతి తక్కువకు 2007లో వైయస్ రాజశేఖర రెడ్డి అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో భూముల్ని కేటాయించారని వచ్చిన ఆరోపణలు నూటికి నూరుపాళ్లూ సత్యమే. తన తనయుడు జగన్ కోసమే ఆయన అరబిందో ఫార్మాకు 49 ఎకరాలు, అదే సంస్థకు చెందిన ఎపి ఎల్ హెల్త్ కేర్‌కు 26 ఎకరాలు, హెటిరో డ్రగ్స్‌కు 66 ఎకరాలు, దాని అనుబంధ సంస్థ అయిన హెటిరో ల్యాబ్స్‌కు 9 ఎకరాలు కేటాయించారు.

అంతేనా.. అరబిందో ఫార్మా అభ్యర్థనపై ఈ భూమిలో 30.33 ఎకరాలు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు కేటాయించారు. అది నూటికి నూరు శాతం తమకు అనుబంధ సంస్థ అని అరబిందో అసత్య ప్రకటనలు చేసింది. ఈ రెండు సంస్థలకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేకూర్చిన అక్రమ ప్రయోజనాలకు బదులుగా ఆ సంస్థలు జగన్‌కు చెందిన జగతి, జనని సంస్థల్లో క్విడ్ ప్రో కో పద్ధతిలో చెల్లింపులు చేశాయి.

జగతిలో రూ.10 ముఖ విలువ చేసే వాటాను రూ.350 పెట్టి కొన్నారు. జననిలో రూ.10 విలువ చేసే వాటాను రూ.102 చొప్పున కొన్నారు. నిజానికి ఈ కంపెనీల స్థాయి అంత ప్రీమియంతో కొనదగ్గ రీతిలో లేదు. అరబిందోకు కట్టబెట్టిన అక్రమ ప్రయోజనాలకు గాను జగతికి రూ.14.5 కోట్లు, హెటిరోకు కట్టబెట్టిన అక్రమ ప్రయోజనాలకు గాను జననికి రూ.15 కోట్లు చెల్లించారు'' అని ధర్మాసనం పేర్కొంది.

ఒకవైపు.. జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ ఎత్తున నష్టాలు ఎదుర్కొంటుండగా.. దాని మొత్తం వాటా మూల ధనం హరించుకుపోగా.. జగతి వాటాలను భారీ ప్రీమియంతో కొనుగోలు చేయవచ్చంటూ డెలాయిట్ సంస్థ బూటకపు నివేదిక ఎలా సమర్పించిందని ధర్మాసనం ప్రశ్నించింది. జగతిలో పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీలు కూడా అనుమానాస్పద కంపెనీలని ఆదాయపు పన్ను విభాగం దర్యాప్తు నివేదికలో తేలినట్లు ధర్మాసనం పేర్కొంది. హౌరాలోని ఆర్టిలెంజర్స్ బయో ఇన్నోవేషన్స్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, స్టాక్‌నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలకు ఒకే డైరెక్టర్, ఒకే చిరునామా ఉన్న విషయాన్ని ధర్మాసనం ఎత్తి చూపింది.

అలాగే, ముంబైకి చెందిన హింగోరా ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతాలోని స్టాక్‌నెట్ కంపెనీలకు కూడా ఒకే డైరెక్టర్ ఉన్నారని, వాటికి ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటీసులు వెనక్కు తిరిగి వచ్చాయని ఎత్తి చూపింది. ముంబై, బెంగళూరుల్లోని అనేక ఇతర కంపెనీల గురించి కూడా ఇలాంటి పలు అనుమానాస్పద విషయాలు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు నివేదికలో వెలుగులోకి వచ్చాయని వివరించింది. "అంతేకాక జగతిలో వాటాకు రూ.350 చెల్లించి పెట్టుబడులు పెట్టిన మ్యాట్రిక్స్ గ్రూప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందింది. ఓడరేవు, నిజాంపట్నం రేవులను, పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను దక్కించుకుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

రామ్‌కీ గ్రూపు నెలకొల్పిన ఎరస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీపీ బిజినెస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కూడా జగతిలో వాటాకు రూ.340 చొప్పున చెల్లించి పెట్టుబడులు పెట్టాయని, అందుకు బదులుగా గచ్చిబౌలిలో హౌసింగ్ బోర్డుకు చెందిన భూమి, రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ గ్రామంలో ప్రభుత్వ భూమి, విశాఖలో ఎస్ఈజెడ్‌లను కట్టబెట్టిన విషయాన్ని ఈడి పేర్కొంది. వీటన్నింటినీ చూస్తే జగన్మోహన రెడ్డి కంపెనీల్లో అత్యధిక ప్రీమియం చెల్లించి వాటాలు కొన్న సంస్థలన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందన్న విషయం స్పష్టమవుతోంది. లేకపోతే బుద్ధి ఉన్న ఏ పెట్టుబడిదారుడూ నష్టాలను ఎదుర్కొంటున్న జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అవి పెట్టుబడుల రూపంలో ఉన్న లంచాలే

భూముల కేటాయింపులు జరిగిన తేదీలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తేదీలను చూస్తే వాటిని పెట్టుబడులు అని కాకుండా లంచాలని నిర్థారించడానికి పూర్తి అవకాశం ఉందని, పెట్టుబడుల రూపంలో చెల్లించినవి లంచాలేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కంపెనీలకు లభించిన లాభాలను, జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను నేరంలో భాగంగా జప్తు చేసుకోరాదన్న వాదనతో తాము ఏకీభవించటం లేదని తెలిపింది. ఈ విషయంలో ఈడీ అదనపు డైరెక్టర్ చేసిన అంచనాను అంగీకరిస్తున్నామని చైర్మన్ మిశ్రా స్పష్టం చేశారు. ముడుపులు చెల్లించిన వారు, ముడుపులు తీసుకున్నవారు ఇద్దరూ నేరంలో భాగస్తులేనని తెలిపారు. జప్తు చేసిన ఆస్తులకు, నేరపు సొమ్ముకు ప్రత్యక్ష సంబంధం లేదన్న వాదనను కూడా ధర్మాసనం కొట్టిపారేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+