తీర్మానం లేకుండా 144 రోజుల్లో తెలంగాణ?

కాంగ్రెసు పార్టీ తెలంగాణకు మొగ్గు చూపుతోందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా తెలంగాణ వైపు అడుగులేస్తోందంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన ప్రక్రియను ఇంతకుముందు అంచనా వేసిన దానికన్నా ముందే పూర్తి చేయొచ్చని కేంద్ర హోంశాఖ భావిస్తోందట. వీలైనంత త్వరగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోందంటున్నారు.
ఇందులో భాగంగా కేవలం 144 రోజుల్లోనే రాష్ట్ర విభజన పూర్తి చేయొచ్చని హోంశాఖ అధికారులు తాజాగా అభిప్రాయానికి వచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏదైనా రాష్ట్ర ఏర్పాటుకు మొత్తం 215 రోజుల సమయం పడుతుందంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఒక నోట్‌ను తయారు చేసిందంటున్నారు. హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు అధికారులు దాన్ని అందజేశారట.
కోర్ కమిటీ సమావేశానికి ముందు ఈ నోట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణకు అందజేశారు. దీని ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియలో 12 దశలున్నాయి. ఇవన్నీ పూర్తి కావడానికి 215 రోజుల సమయం పడుతుంది.
అయితే తెలంగాణ ఏర్పాటుకు ఇంత సమయం అవసరం లేదని, కొన్ని దశలను కుదించవచ్చని హోంశాఖ తాజాగా నిర్ణయానికి వచ్చిందనే వార్తలు వచ్చాయి. అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం లేదని, ఇప్పుడు కేంద్రం భావిస్తోందని, బిల్లును నేరుగా అసెంబ్లీ అబిప్రాయానికై చివర్లో పంపనున్నట్లు తెలుస్తోందంటున్నారు. మరోసారి అఖిల పక్షానికి కూడా అవకాశముందంటున్నారు. అయితే ఇదంతా బిల్లు తర్వాతే అంటున్నారు.












Click it and Unblock the Notifications