రాహుల్ వెనుకే: మోడీకి పెరిగిన ముస్లింల మద్దతు

Narendra Modi - Rahul Gandhi
2014 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి ఎవరు? అంటే అత్యధిక శాతం మంది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపారు. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా మోడీనే అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో వెనుకబడ్డారని సిఎన్ఎన్-ఐబిఎన్, ద హిందూ పత్రిక తరఫున ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ సిఎస్‌డిఎస్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

అయితే మోడీకున్న ప్రజాదరణ బిజెపి అధికారంలోకి రావడానికి పనికిరాదని తేలింది. ఈ సర్వే ప్రకారం గత రెండేళ్లలోనే మోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణ నాలుగు రెట్లు పెరిగింది. 2011లో ఐదు శాతం ప్రజల మద్దతు సాధించిన మోడీ.. ప్రస్తుతం దాన్ని 19 శాతానికి పెంచుకున్నారు. ఇక రెండేళ్ల కిందట 19 శాతం మంది ఓటర్ల మది దోచుకున్న రాహుల్ గాంధీకి ఇప్పుడు 12శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నారు.

ఈ విషయంలో ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ 6శాతంతో మూడో స్థానంలో, బీజేపీ అగ్రనేత అద్వానీ 2 శాతం మంది ప్రజాదరణకే పరిమితమయ్యారు. ఇక ముస్లింలు, దక్షిణాది రాష్ట్రాల్లో మోడీతో పోల్చితే ప్రజాదరణలో రాహుల్ గాంధీనే మెరుగ్గా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మోడీ హవా నడుస్తోంది. ఇక ముస్లింలు కూడా క్రమంగా మనసు మార్చుకుంటున్నారు. గతంలో రెండు శాతమే మోడీని ప్రధానిగా ఆమోదించగా ప్రస్తుతం 9 శాతానికి పెరగడం విశేషం.

రాహుల్ మాత్రం 19శాతం మంది ముస్లింల దరి చేరారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ని ప్రకటిస్తే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల్లో ఆ పార్టీకి సానుకూలత వ్యక్తమవుతోంది. ఇక బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీ అయితే యువత, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ప్రజలు, బిజెపి... కాంగ్రెస్ మధ్య నేరుగా పోటీ ఉన్న ప్రాంతాల్లోని వారు ఆయనవైపు మొగ్గు చూపుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మోడీనే నాయకత్వం వహించాలని ఆ పార్టీ మద్దతుదారుల్లో 64 శాతం మంది కోరుకుంటున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బిజెపినే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎలక్షన్ ట్రాకర్ సర్వేలో వెల్లడైంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కూడా రేసులో ఉంటుందని తేల్చింది. రెండు పార్టీలకూ ఇతర పార్టీల మద్దతు అత్యవసరం కానుంది. సర్వే ప్రకారం బిజెపికి 156 నుంచి 164 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత భాగస్వాములనూ కలుపుకుంటే ఎన్డీఏ బలం 172-180 వరకు ఉంటుంది.

ఇక కాంగ్రెస్‌కు 131-139 సీట్లు వస్తాయి. ప్రస్తుతం ఆ పార్టీకి 206 సీట్లు ఉన్నాయి. అంటే డెబ్బై సీట్ల వరకు తగ్గే అవకాశముంది. భాగస్వామ్య పార్టీలనూ కలిపితే యుపిఏకు 149-157 సంఖ్యాబలం ఉంటుంది. 545 మంది సభ్యులుండే లోక్‌సభలో మ్యాజిక్ ఫిగర్ 272ను సాధించడానికి కాంగ్రెస్, బిజెపిలు రెండూ శ్రమించాల్సి ఉంటుంది. మొత్తానికి ఇతర పార్టీల చేతుల్లోనే మిగతా 224 సీట్లు ఉంటాయి.

2009 సాధారణ ఎన్నికల్లో 116 సీట్లు మాత్రమే సాధించిన బిజెపి ఈ ఐదేళ్లలో యూపీఏ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోలేక పోతోందని సర్వే చెబుతోంది. పార్టీలో నాయకత్వ పోరే దీనికి ప్రధాన అవరోధంగా మారింది. ఈసారి బిజెపి అధికారంలోకి రావాలంటే సెక్యులర్ ముద్ర కోసం పాకులాడే పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి కత్తి మీద సాము చేయాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహం రచిస్తే బిజెపికి అవకాశాలు మెరుగవుతాయని సర్వే పేర్కొంది. కాంగ్రెస్‌కూ అధికార పీఠానికి ద్వారాలు తెరిచే ఉంటాయని, సెక్యులర్‌వాదంతో ఎక్కువ పార్టీల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉండటం కాంగ్రెస్‌కు కలిసివస్తోంది. అవసరమైతే మమత, వామపక్షాలు దగ్గరవుతాయి. మాయావతి, ములాయం, వైయస్ జగన్, నితీష్, జయలలిత వంటి వారు కూడా సహకరించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+