వైయస్ విజయమ్మ కఠినంగా వ్యవహరిస్తారా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే వేటు తప్పదని ఆమె పార్టీ నాయకులను హెచ్చరించారు. నెలవారీ సర్వేలు నిర్వహిస్తున్నామని, సరిగా పనిచేయడం లేదని సర్వే ఫలితాలు తేలిస్తే సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పిస్తామని ఆమె అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ కన్వీనర్లుీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, నియోజకవర్గం సమన్వయకర్తలతో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో విజయమ్మ తన సహజశైలికి భిన్నంగా మాట్లాడారు. ఆమె మాటలు కటువుగా అనిపించాయి. పార్టీని నిలబెట్టడానికి ఆ మాత్రం కఠినంగా ఉండక తప్పదనే నిర్ణయానికి రావడం వల్లనే ఆ హెచ్చరికలు చేశారని అంటున్నారు. జనం వద్దకు వెళ్లకపోతే తప్పిస్తామని, తామే కాబోయే ఎంపిలం, ఎమ్మెల్యేలం అని ఇప్పటి నుంచే వ్యవహరిస్తే కుదరదని, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ కావాలంటే పైపైన పనిచేయడం సరిపోదని, సరిగా పనిచేయాలని ఆమె పార్టీ నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు.
ఏడాది కాలంగా వైయస్ జగన్‌ను జైలులో ఉంచడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్ష ఊహించిన స్థాయిలో విజయవంతం కాలేదని పార్టీ నాయకులు భావించారు. ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించకతప్పదనే అభిప్రాయానికి విజయమ్మ వచ్చినట్లు భావిస్తున్నారు. వైయస్ జగన్ అందుబాటులో లేని ప్రస్తుత స్థితిలో తాను మెత్తగా ఉంటే లాభం లేదని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే, కఠినంగానే వ్యవహరించాలని భావించి, పార్టీ నాయకులకు హెచ్చరికలు చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications