తొలి అడుగు: కిరణ్ పార్టీపై సర్వే, ప్రశ్నావళి సిద్ధం!

కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలంటూ కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల కంటే కిరణ్‌కే ఎక్కువ ఆదరణ ఉందని పలువురు భావిస్తున్నారు. కిరణ్ వెంట నడిచేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే, సీమాంధ్ర ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సన్నిహితులు రంగంలోకి దిగారట. కిరణ్ కొత్త పార్టీని స్థాపించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, పార్టీని స్థాపించే ముందు సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు వీలుగా సమగ్ర సర్వేను నిర్వహించడానికి వారు సిద్ధమయ్యారని వివరిస్తున్నాయి. కొత్త పార్టీ పైన కిరణ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
కిరణ్ తీరుపై అధిష్ఠానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే, ముఖ్యమంత్రిని మార్చే యోచనకు అధిష్ఠానం వచ్చిందన్న కథనాలు కిరణ్ సన్నిహితులను కలవరపరుస్తున్నాయి. అదే సమయంలో, సీమాంధ్రలో కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందని, ఏం చేసినా ఈ ప్రాంత ప్రజలు పార్టీని విశ్వసించేందుకు సిద్ధంగా లేరని భావిస్తున్నారు. దీంతో, ముఖ్యమంత్రి పార్టీని స్థాపిస్తే సీమాంధ్రలో హీరో అవుతారన్న ధీమాను కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.
సీమాంధ్రలో కిరణ్ పర్యటిస్తున్నప్పుడు ఆయనను ఉద్దేశించి 'సమైక్యాంధ్ర సింహం' అంటూ నినదించడాన్ని ఉదహరిస్తున్నారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటననే ప్రత్యక్ష నిదర్శనగా చూపుతున్నారు. తుఫాను బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించినా బాధితుల నుంచి రాని స్పందన విభజన తుఫానును అడ్డుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలపై రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన వెంటే ఉంటామని మంత్రి పితాని సత్యనారాయణ లాంటి వారు చెప్పారు.
మరికొందరు బహిరంగంగా చెప్పకపోయినా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత దానిని వ్యతిరేకిస్తూ కిరణ్ శాసనసభ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించవచ్చునని అంటున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకునేందుకు కిరణ్ సన్నిహితులు సిద్ధమయ్యారు.
వాస్తవానికి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున సోమవారం నుంచే అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారని, ఇందుకు సంబంధించిన ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారట. అయితే, ఈ సర్వే కార్యక్రమాన్ని వారం రోజులపాటు వాయిదా వేశారని, దీపావళి అమావాస్య వెళ్లి పోయిన తర్వాత వేగిరపరచాలన్న యోచనలో కిరణ్ అనుయాయులు ఉన్నారట. సర్వేకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారట. సర్వేతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించి ఇటీవల మీడియాతో కిరణ్ చేసిన వ్యాఖ్యల తాలూకు దినపత్రికల క్లిప్పింగులను ఓ చిన్న పుస్తకంగా మార్చి.. 'సమైక్యాంధ్ర సింహం' పేరిట పంపిణీ చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications