అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవి బాటలో తనయుడు శ్రీరామ్!

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవీంద్ర బాటలో ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ అడుగులు వేస్తున్నారు. పరిటాల రవి తన వాళ్లనుకున్న వారికోసం, పేద ప్రజల కోసం అనేక సహాయక కార్యక్రమాలు చేసేవారు. గతంలో రవి చేసిన సామాజిక కార్యక్రమాలను ప్రస్తుతం ఆయన కుమారుడు శ్రీరామ్ కొనసాగిచ్చేందుకు ముందుకు వచ్చారు.

పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ గొడవల్లో ఉన్న సమయంలో కూడా పేదల కోసం ఉచిత సామూహిక వివాహాలను చేయించారు. తన సొంత ఊరు దగ్గర ఉన్న తిరుమల దేవర వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆట్టహాసంగా సామూహిక వివాహ మహోత్సవాన్ని రవి తన చేతులమీదుగా నిర్వహించారు. అప్పుడు జరిగిన ఈ వివాహమహోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరవడం విశేషం.

కాగా, పరిటాల రవీంద్ర హత్యానంతరం కొంతకాలం ఈ సంప్రదాయానికి బ్రేక్‌పడింది. అయితే ఇప్పుడు ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్‌ ముందుకొచ్చారు. పరిటాల ట్రస్ట్ ద్వారా ఉచిత సామూహిక వివాహాలను జరిపించడానికి శ్రీరామ్ సిద్ధమయ్యారు.

Paritala Sriram walks his father's footsteps

పరిటాల రవి సతీమణి, శ్రీరామ్ తల్లి మంత్రి సునీత సహకారంతో చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి.

కరువు పరిస్థితుల కారణంగా అనంతపురం జిల్లాలో కూతుళ్ల పెళ్లిళ్లు చేయడం పేద తల్లిదండ్రులకు భారంగానే మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది సామూహిక వివాహాల కోసం తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. పెద్దల అంగీకారంతో సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

ఒక్కో జంటకు 10వేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. పెళ్లికొడుకుల కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా దుస్తులు తెప్పిస్తున్నారు. ధర్మవరంలో 10టన్నుల లడ్డూలకి కూడా ఆర్డర్‌ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ ఎదుగుదలను కొందరు తెలుగుదేశం నేతలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సేవా కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రికి ఆయన దగ్గరవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అంతేగాక, సీఎం తనయుడు లోకేశ్‌కు కూడా టచ్‌లో ఉంటున్నట్లు తెలిసింది. పరిటాల సునీత సైతం అన్ని కార్యక్రమాలకు కొడుకుని ముందుంచి నడిపిస్తున్నారట.

Paritala Sriram walks his father's footsteps

భవిష్యత్తులో సునీత స్థానాన్ని శ్రీరామ్‌ భర్తీచేసే అవకాశముందని కొందరు విశ్లేషిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కొన్ని మండలాల్లో ప్రతికూల పరిస్థితి ఉన్నా వాటిని అనుకూలంగా మార్చుకోవడంలో శ్రీరామ్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా.. తల్లి నీడలో రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, నియోజకవర్గంలో చిన్నా, పెద్ద నాయకులు మొదలుకొని అందరినీ కలుపుకుపోతున్నారు. కొత్త వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించి టీడీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కళ్యాణదుర్గం రోడ్డులో ఎంతో కాలంనుంచి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల సమస్యను శ్రీరామ్‌ పరిష్కరించడంతో అతనిపై స్థానికులకు కొంత నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తోంది.

పరిటాల సునీత అనంతరం ఆయనే రాజకీయ నేతగా ఎదుగుతున్నారని స్థానిక తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, సామాజిక సేవా కార్యక్రమాలు వెనక రాజకీయ ప్రయోజనాలు కూడా లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి రాజకీయ నాయకులు చేసే కొన్ని మంచి పనులు పేదలకు అండగా ఉంటున్నట్లు చెప్పుకోవచ్చు.

English summary
It is said that Telugudesam Party leader Paritala Sriram walks his father's footsteps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X