తెలంగాణ సిఎం పదవి రేసులో ఎవరెవరు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై చర్చలు ఊపందుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవిపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ నోట్ ఆమోదంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తమ అధిష్టానం తెలంగాణ బిల్లును ఈ శీతకాల పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదిస్తుందని భావిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 23 నుంచి డిసెంబర్ 22వరకు జరగాల్సిన శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో స్వల్ప మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉత్కంఠ నెలకొంది. చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోనూ, కాంగ్రెస్‌లో మంచి రాజకీయ నేతగా పేరున్న వారికే అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌లు కూడా జైపాల్‌రెడ్డి, జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీధర్ బాబు, గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణలు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 18మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం శాసనసభ్యులు 119లో 15శాతంగా ఉంటుంది. 48మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. భావసారూప్య పార్టీలైన టిఆర్ఎస్ నుంచి 17, ఎంఐఎం పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications