రాయల అంటే టి భగ్గు: సీమ నేతలదీ అదే దారీ!

రాయల తెలంగాణ ప్రతిపాదన వస్తే తిరిగి సకల జనుల సమ్మె జరుపనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస ప్రకటించింది. సిడబ్ల్యుసి పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు తీర్మానం చేసిందని, తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేసింది. ఇంతకాలం రాయలసీమ ముఖ్యమంత్రులే పాలించి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయల తెలంగాణను ఒప్పుకునేది లేదని, అలాంటి ప్రతిపాదన వస్తే తిరిగి సకల జనుల సమ్మెకు వెళ్తామని టిజెఎసి ప్రకటించింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రాయల టి అంటే తెలంగాణ భగ్గుమంటుందన్నారు.
అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఏదీ తన దృష్టికి రాలేదని, పది జిల్లాల తెలంగాణ మాత్రమే ఏర్పడుతుందని మంత్రి శ్రీ్ధర్ బాబు తెలిపారు. సిడబ్ల్యుసి తీర్మానం జరగడానికి ముందు రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తే ఆలోచించే వాళ్లమని, తీర్మానం తరువాత మార్చడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి అన్నారు.
రాయలసీమ సంస్కృతి వేరు, తెలంగాణ సంస్కృతి వేరాని, ఈ రెండు ప్రాంతాలను కలపడం తగదని, తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే మొదటి నుంచీ బిజెపి మద్దతు ప్రకటించింది. కానీ, రాయల తెలంగాణను ఒప్పుకునేది లేదని బిజెపి నేతలు అంటున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాయల తెలంగాణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి బలరాం నాయక్ అన్నారు. రాయల తెలంగాణను ఎవరు కోరుకోవడం లేదని, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణనే కేంద్రం ఇస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాయల టిని ఒప్పుకోమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాయల తెలంగాణ పేరుతో కొత్త నాటకాలు చేస్తే ఊరుకునేది లేదని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
పది జిల్లాల తెలంగాణనే తాము కోరుకుంటున్నామని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు, సిడబ్ల్యూసి తీర్మానానికి అనుగుణంగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని, రాయల టి అంటే జనం కాంగ్రెసు సంగతి తేల్చుతారని బిజెపి నేత బండారు దత్తాత్రేయ హెచ్చరించారు.
రాయల తెలంగాణ అనేది పత్రికల వార్తా కథనం మాత్రమేనని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఇలాంటి కథనాలు రెండ్రోజులకు ఒకటి చొప్పున వస్తాయన్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడంలో ఎపిఎన్జీవోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. రాయలసీమను విడగొట్టవద్దని బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి నేతలు కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications