రాజీనామాలతో: టి దిశగా రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?

Telangana: President Rule suspense
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా సత్వరమే అసెంబ్లీకి విభజన ప్రతిపాదన పంపించడం ద్వారా సీమాంధ్ర నేతలకు రాజీనామాల పొగ పెట్టి ఆ సాకుతో కేంద్ర పాలన దిశగా అడుగులు వేస్తోందని ప్రచారం సాగుతోంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పెద్దలు విభజన విషయంలో విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. జివోఎంకు విధించిన గడువు ఎత్తివేయడం పైన వేర్వేరుగా మాట్లాడారు.

అసెంబ్లీకి తీర్మానం రెండుసార్లు వస్తుందని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెబితే, ఒకసారే వస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్నారు. అయితే కేబినెట్ నోట్ ఆధారంగా, అతి త్వరలో అసెంబ్లీ తీర్మానం లేదా అభిప్రాయం కోరనున్నట్టు కేంద్రం తాజాగా ఇచ్చిన లీకు వెనక, వేరే ఎత్తుగడ దాగి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించిన వెంటనే పదవులకు రాజీనామాలు చేస్తామని సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రకటనను తనకు అనుకూలంగా మలచుకుని, రాష్ట్రపతి పాలన విధించి, తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం ఎత్తులు వేస్తున్నట్టు సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్యులు అనుమానిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా ఉండే సీమాంధ్ర కాంగ్రెస్, జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు అధిష్ఠానం వేసిన ఎత్తుగడ ఇంతకుముందు బెడిసి కొట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైకమాండ్ కొత్త వ్యూహానికి తెరలేపిందని ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం... కేబినెట్ నోట్ ఆధారంగా తీర్మానమో, లేక జివోఎంపై అభిప్రాయమో కోరే అంశం ఈ నెలాఖరులోనే అసెంబ్లీకి రానుందట. దీనిపై అసెంబ్లీ తన అభిప్రాయం చెప్పిన వెంటనే సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు జరిగిన వెంటనే, దాన్ని సాకుగా చూపించి, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించి, రాష్ట్ర విభజన జరిపి, ఎన్నికలకు వెళ్లాలన్నది హైకమాండ్ వ్యూహంగా చెబుతున్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేయాలంటే రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రపతి పాలనను చివరి అవకాశంగా భావిస్తామన్న షిండే ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. తెలంగాణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకే జివోఎం గడువు ఎత్తేశామని ఆయన పేర్కొనడం గమనార్హం. జివోఎంకు గడువు ఎత్తివేత కేంద్రం వ్యూహంలో భాగమేనని, దానిపై తెలంగాణవాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీలకు భరోసా ఇవ్వడం ప్రధానమైన అంశం.

జివోఎంకు ఆరువారాల గడువు అమల్లో ఉంటే, ఆ లోపే నివేదిక తెప్పించుకుంటే, విమర్శలు వ్యక్తమవుతాయనే ఉద్దేశంతోనే గడువు ఎత్తేసినట్టు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తీర్మానం, బిల్లు ముసాయిదాల్లో దేన్ని అసెంబ్లీకి పంపిస్తారు? రెండింటినీ పంపుతారా? ఒకదాన్నేనా? అన్న అంశాలపై కూడా కేంద్రం కావాలనే గందరగోళం సృష్టిస్తున్నట్టు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ దశలో శాసన సభ తీర్మానం ప్రసక్తి ఉండదని, కేబినెట్ ముసాయిదా బిల్లును ఆమోదించి, రాష్ట్రపతికి పంపితే, ఆయన అసెంబ్లీ అభిప్రాయం కోసం ఇక్కడికి పంపుతారని చెబుతున్నారు.

దిగ్విజయ్ మాత్రం తీర్మానం ఉంటుందని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన అంశం రెండుసార్లు అసెంబ్లీకి వస్తుందని దిగ్విజయ్ తనకు చెప్పినట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొనగా, జివోఎం సిఫారసులతో తయారు చేసే బిల్లు ముసాయిదాను మాత్రమే అసెంబ్లీకి పంపిస్తామని షిండే ఢిల్లీలో పేర్కొన్నారు. ఏదో ఒకదాన్ని అసెంబ్లీకి పంపించి పని ముగించుకోవడమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోందని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు.

విభజనను ప్రతిపాదనను అసెంబ్లీ వ్యతిరేకిస్తే, ఏం చేస్తారన్న ప్రశ్నకు... "రాజ్యాంగాన్ని అనుసరిస్తాం. రాజ్యాంగం దీనికి పరిష్కారం చూపింది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటే రాజ్యాంగాన్ని చదువుకోండి'' అని షిండే జవాబివ్వడం గమనార్హం. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం రాష్ట్ర విభజనపై పార్లమెంటుదే సంపూర్ణ అధికారం. అంటే అసెంబ్లీ అభిప్రాయం నామమాత్రమే. అందువల్ల 'నామమాత్రమైన అసెంబ్లీ అభిప్రాయాన్ని లాంఛనంగా నెలాఖరులోగా తెప్పించుకుని విభజనను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్, తదితరులు వారంతట వారే పదవుల నుంచి వైదొలిగే పరిస్థితి కల్పించి, రాష్ట్రపతి పాలన విధించి, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలన్నది హైకమాండ్ వ్యూహంగా చెబుతున్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం, రాష్ట్ర విభజన జరగడం అనేవి ఎలాంటి అవరోధాలూ లేకుండా సజావుగా సాగాలంటే. అధిష్ఠానానికి ఇంతకంటే మరో గత్యంతరం లేదంటున్నారు. విభజన విషయంలో వెనక్కు పోయినా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశలు అధిష్టానం పెద్దలకు లేవని, ఇదే సమయంలో తెలంగాణలో తిరుగుబాటు వస్తుందని, శాంతి భద్రతలు క్షీణిస్తాయని అధిష్ఠానం భయపడుతోందట. అందుకే రాష్ట్రపతి పాలన విధించైనా ముందుకే వెళ్లాలని భావిస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+