రంగంలోకి ప్రత్తిపాటి: డిఆర్‌సి మీటింగ్‌కు మాణిక్యాలరావు డుమ్మా, తగ్గనంటున్న బాపిరాజు?
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి నేతల మధ్య ఆగాధం పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు, జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా సమీక్షా మండలి సమావేశానికి మంత్రి మాణిక్యాలరావు గైరాజర్ కావడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఇంచార్జీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయమై జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజుతో చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే తాను వెనక్కి తగ్గేది లేదని బాపిరాజు కూడ అంతే పట్టుదలతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
Recommended Video

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి, టిడిపి వర్గీయుల మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల కాలంలో మంత్రి మాణిక్యాలరావు టిడిపి వర్గీయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
మంత్రి మాణిక్యాలరావుపై జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు వర్గీయులు కూడ ఎదురుదాడికి దిగారు.ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతల నుండి నివేదిక కోరారు. రెండు వర్గాలు పట్టు విడుపులను ప్రదర్శించడం లేదు.

డిఆర్‌సి మీటింగ్‌కు మంత్రి మాణిక్యాలరావు గైరాజర్
డిఆర్‌సి సమావేశానికి మంత్రి మాణిక్యాలరావు గైరాజరయ్యారు. తాడేపల్లి గూడెం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో చోటు దక్కించుకొన్న బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు, స్థానికంగా ఉన్న టిడిపి నేతలకు మధ్య కొంతకాలంగా పొసగడం లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకొంటున్నారు. ఈ పరిణామాలను పురస్కరించుకొని డిఆర్‌సి సమావేశానికి మంత్రి మాణిక్యాలరావు గైరాజర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

సోము వీర్రాజుపై వివాదాస్పద వ్యాఖ్యలు
మంత్రి మాణిక్యాలరావుకు మద్దతుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుచేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు కూడ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. సోము వీర్రాజుపై స్థానిక టిడిపి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై టిడిపి నేతలపై బిజెపి నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

రంగంలోకి దిగిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి,బిజెపి నేతల మధ్య చోటు చేసుకొన్న వివాదాన్ని పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా ఇంచార్జీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆదేశించారు.చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ విషయమై టిడిపి జిల్లా సమన్వయకమిటీ సమావేశం తర్వాత మంత్రి పుల్లారావు జిల్లా పరిషత్ ఛైర్మెన్ బాపిరాజుతో విడిగా సమావేశమయ్యారు.ఈ విషయమై బాపిరాజు తన వాదనను విన్పించారని సమాచారం.టిడిపి బలంతో గెలిచిన మాణిక్యాలరావు టిడిపిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని పుల్లారావు దృష్టికి బాపిరాజు తెచ్చినట్టు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రి మాణిక్యాలరావు
జిల్లా సమీక్షా మండలి సమావేశానికి మంత్రి మాణిక్యాలరావు హజరుకాకపోడం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం వరకు మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెంలోనే ఉన్నారని సమాచారం. అయితే ఆ తర్బాత కృష్ణా జిల్లా పర్యటనకు మంత్రి మాణిక్యాలరావు వెళ్ళారు. ఈ సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొనకపోవడం మాత్రం రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య జిల్లాలో అంతరం మరింతగా పెరుగుతోందనేందుకు సంకేతాలను ఇస్తోందంటున్నారు విశ్లేషకులు.












Click it and Unblock the Notifications