రేపు మోడీ క్యాబినెట్ విస్తరణ: యువరక్తం ప్లస్ అనుభవం!
అనుభవానికి తోడు యువ రక్తానికి తన క్యాబినెట్ లో చోటు కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 2014 మేలో ప్రధానిగా కొలువు దీరిన తర్వాత .. 2016 జూలైలో జరిగిన తొలి క్యాబినెట్ విస్తరణ జరిగి
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. మరో 18 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాజకీయ, సామాజిక సమీకరణాలు ప్లస్ అనుభవానికి తోడు యువ రక్తానికి తన క్యాబినెట్ లో చోటు కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
2014 మేలో ప్రధానిగా కొలువు దీరిన తర్వాత .. 2016 జూలైలో జరిగిన తొలి క్యాబినెట్ విస్తరణ జరిగింది. అప్పుడు 19 మందిని కొత్తగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్న ప్రధాని మోదీ.. ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. అంతేకాదు స్వతంత్ర ప్రతిపత్తితో పర్యావరణశాఖ సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్‌కు కేబినేట్ హోదాతోపాటు కీలకమైన మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ కేటాయించారు.
మళ్లీ 13 నెలల తర్వాత మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఆదివారం జరుగనున్నది. మంత్రుల పనితీరును సమీక్షించిన తర్వాతే మార్పులు చేర్పుల జాబితా తయారు చేసుకున్నట్లు తెలుస్తున్నది. కులం, ప్రాంతం, సామాజిక సమీకరణాల కంటే పనితీరు, ప్రతిభా పాటవాలు గలవారికి చోటు కల్పిస్తామని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రధాని మోదీ జాతికి సంకేతాలివ్వనున్నారు. లోక్ సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతున్నదని సమాచారం.

రాం మాధవ్, హిమంత బిశ్వ శర్మలకు చోటు?
ఇక వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, పట్టణాభివ్రుద్ధి, నైపుణ్యాభివ్రుద్ది వంటి శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక మంత్రులు లోక్ సభ ఎన్నికలకు ముందే ఇన్ స్టంట్ ఫలితాలివ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ సారథ్యంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధి మండలి చైర్మన్ హిమంత బిశ్వశర్మకు రక్షణ శాఖ కేటాయిస్తారని తెలుస్తున్నది. ఇక పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ కు పట్టణాభివ్రుద్ధి శాఖను కేటాయిస్తారని తెలుస్తున్నది. ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం పార్టీలకూ చెరో బెర్త్ లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. బీహార్ మాజీ సీఎం కార్పూరి ఠాకూర్ కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్ కూడా మంత్రి పదవిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

జేడీయూ నేత ఆర్సెపీ సిన్హాకు రైల్వే చాన్స్
ఇటీవల వరుస రైలు ప్రమాదాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న సురేశ్ ప్రభు తప్పుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తానన్న సురేశ్ ప్రభును వేచి ఉండాలని ప్రధాని మోదీ కోరారు. ఒకవేళ తప్పనిసరైతే అయితే సురేశ్ ప్రభును పర్యావరణ మంత్రిత్వశాఖకు మార్చి, ఉపరితల రవాణా నౌకాయాన శాఖల్లో రైల్వేశాఖను విలీనం చేసి నితిన్ గడ్కరీకి కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జేడీయూ నేత ఆర్సీపీ సిన్హాను కేబినెట్ లోకి తీసుకుని రైల్వేశాఖ కేటాయించినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు.

పీయూష్ తదితరులకు ప్రమోషన్ పక్కా..
లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ వాణి సమర్థవంతంగా వినిపించే లక్ష్యంతో ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న నిర్మలాసీతారామన్ సేవలను బీజేపీ అధికార ప్రతినిధిగా వినియోగించుకోవాలని ప్రధాని తలపోస్తున్నారని వినికిడి. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆరెస్సెస్ అంచనాలకు అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తితో సహాయ మంత్రులుగా పనిచేస్తున్న పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, మనోజ్ సిన్హా, జితేంద్ర సింగ్‌లకు క్యాబినెట్ హోదా కల్పించే సంకేతాలు ఉన్నాయి.

మహారాష్ట్ర గవర్నర్‌గా కల్రాజ్ మిశ్రా?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసార్ రైతుల నిరసన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రాధామోహన్ సింగ్‌తోపాటు విష్ణుదేవ్ సాయి, సుదర్శన్ భగత్, సంజీవ్ కుమార్ బాల్యన్, క్రుష్ణరాజ్, విజయ్ సంప్లాలను తప్పిస్తారని వార్తలొచ్చాయి. పలు రాష్ట్రాలకు గవర్నర్లు లేరు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల్లో కొందరిని గవర్నర్లుగా పంపాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అందులో కల్‌రాజ్ మిశ్రా వంటి సీనియర్ మంత్రుల్ని గవర్నర్లుగా పంపాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. కల్ రాజ్ మిశ్రా అత్యధిక శాతం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయి.

మురళీధర్ లేదంటే కిషన్‌రెడ్డిలకు చాన్స్?
బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా తప్పుకుంటే ఆయనను గవర్నర్ గా పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి గానీ, మురళీధర్‌రావుకు గానీ క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతున్నది. దత్తాత్రేయను గవర్నర్‌గా పంపిస్తే, ఖాళీ అయ్యే సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కిషన్‌రెడ్డిని గెలిపించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే, కిషన్‌రెడ్డిని ప్రస్తుత విస్తరణ లోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న తెలంగాణ నేత మురళీధర్‌రావు పేరు కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేవారి జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన సేవలను పార్టీకే వినియోగించుకోవాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నదని సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు.

అశోక్ శాఖ మార్పు ఖాయమా?
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు క్యాబినెట్‌నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో ఏపీ బీజేపీ నుంచి ఒకరికి బెర్త్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో అదే సామాజిక వర్గం నుంచి పదవి ఇవ్వాలనుకుంటే విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు అవకాశం దక్కవచ్చని పరిశీలకులు చెప్తున్నారు. మరో ఎంపీ రాజుల సామాజిక వర్గానికి చెందిన గోకరాజు గంగరాజుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక టీడీపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న అశోకగజపతిరాజు నిర్వహిస్తున్న పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న సుజనాచౌదరికి ఈసారి ప్రమోషన్‌తో స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన మంత్రి పదవి వస్తుందని ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.












Click it and Unblock the Notifications