చిరంజీవి ఇంకా రాజకీయ పార్టీ పెట్టకముందే ఆయనను విమర్శించేవాళ్లు, మద్ధతిచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. అడక్కముందే చేగొండి హరిరామజోగయ్య ఏకంగా చిరంజీవి పార్టీలో చేరతానని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. ఇక మాయావతి మాత్రం తీవ్రంగా విమర్శించింది. సినీ జనాలు కేవలం ఆటపాటలకే పరిమితమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. వారు సమాజానికి చేసేదేమీలేదని అంది. ఇవి కచ్చితంగా చిరంజీవిని ఉద్ధేశించి అన్నవే అన్నది స్పష్టం. ఇన్నాళ్లు చిరంజీవి బీఎస్పీలోకి వస్తాడని చెప్పిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావును ఏకంగా ఆ పదవి నుంచి మాయావతి తొలగించింది. చిరంజీవి బీఎస్పీలోకి వస్తే ఆయన చేరిస్మాతో గట్టెక్కేయవచ్చని కలలు కన్న నల్లా ఆశలు మొదటికే మోసం చేశాయి. అధినేత ఆగ్రహానికి గురయ్యాయి. మొత్తానికి తమ పార్టీకి సినీ జనాలు అక్కరలేదని స్పష్టంగా చెప్పిన మాయావతిని పొగడాలో తెగడాలో అర్థం కాని పరిస్థితి. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు రాగానే ఓట్లు రాల్చుకునేందుకు సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవడం కొత్తేంకాదు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సినీ గ్లామర్ ఉంది. తెలుగుదేశం మహిళాధ్యక్షురాలే సినీ హీరోయిన్ రోజా. కాంగ్రెస్ పార్టీలో దాసరి నారాయణరావు ఉన్నారు. మాయావతి మాత్రం తమకు సినీ గ్లామర్ అక్కరలేదంది. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ తో నల్లా సూర్యప్రకాశరావు జరిపిన మంతనాలు మాయావతికే తెలియకుండా జరిగి ఉంటాయని భావించాలా...లేక ఎలాగూ చిరంజీవి తమ పార్టీలో చేరడనే విషయం తేలిపోవడం వలన అందని దాక్ష పుల్లన అన్నట్టుగా మాయావతి విమర్శలు గుప్పించిందా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఈ విషయంపై చిరంజీవి స్పందనను తెలుసుకుందామనుకున్న మీడియాకు ఆయన దొరకకుండా చెన్నయ్ పోయారు. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది.