ప్రజారాజ్యంలో క్రియాశీలక పాత్ర పోషించడానికి పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బావ మరిది, చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తిరిగి రావడంపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే కలలు అల్లు అరవింద్ తప్పుడు వైఖరుల వల్లనే కల్లలయ్యాయనే విమర్శలున్నాయి. పార్టీలోని ఓ వర్గం అల్లు అరవింద్ రీఎంట్రీపై లోలోపల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోటగిరి విద్యాధర రావు వంటి నాయకులు మాత్రం అల్లు అరవింద్ వల్ల పార్టీ బలోపేతం అవుతుందని అంటున్నారు. అయితే, పైకి చెప్పినంత ఆనందంగా పార్టీ నాయకులు లేరనేది గిట్టనివారి ప్రచారం. అల్లు అరవింద్ పార్టీ విషయంలో ఐరన్ లెగ్ అవుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో అల్లు అరవింద్ టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వాటిని అరవింద్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అయితే, ఆయన క్రమంగా పార్టీ కార్యకలపాలకు దూరమయ్యారు. మళ్లీ ఆయన రీఎంట్రీ పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుందనే అభిప్రాయం ఉంది. పార్టీని కాంగ్రెసు వైపు నడిపించడంలో కూడా అల్లు అరవింద్ పాత్రనే ముఖ్యమైందని అంటారు. రాజ్యసభ సీటుపై కన్నేసిన ఆయన ప్రజారాజ్యం పార్టీని అందుకు అనుగుణంగా కాంగ్రెసుకు అనుకూలంగా మలిచారని అంటారు. ఏమైనా, అల్లు అరవింద్ కల నిజం కావడానికి మాత్రం అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.