రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లే ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లున్నారు. సీమాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన జరిగితే కొంపలేం మునగవనే అభిప్రాయంతోనే ఉన్నారు. అందుకు సీమాంధ్ర విద్యార్థుల నుంచి ఆగ్రహాన్ని కూడా ఎదుర్కున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన రాష్ట్ర విభజనపై ఓ స్పష్టతను చేకూర్చే విధంగా ఉంది. నాలుగు నెలలైతే ఎవరి వాటా ఎంతో తేలుతుందని ఆయన అన్నారు. ఆ మాటను ఆయన అతి మామూలుగానే అన్నారు. తెలంగాణ వాటా తేలేవరకు ఎపిపిఎస్సీ గ్రూప్ -1 పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ విద్యార్థులు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదంటూ ఆ మాట అన్నారు. నాలుగు నెలల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుందని చెప్పిన మాటను సీరియస్ గానే తీసుకునే పరిస్థితే ఉంది. డిసెంబర్ 31వ తేదీ లోగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పిస్తుంది. సరిగ్గా నాలుగు నెలలు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బొత్స సత్యనారాయణ ఆ మాట అన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.