ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఆశలు వదులుకున్నట్లు లేదు. ఆయన ఎప్పుడు సమయం వస్తుందా ఆ పదవిని చేపడదామనే ఆశతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు ప్రభుత్వంపై పోరు చేయలేక, ఇటు పట్టించుకోకుండా ఉండలేక నలిగిపోతున్నారని అంటున్నారు. రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మరోవైపు ఈ నెల 21, 22 తేదీల్లో వైయస్ జగన్ విజయవాడలో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతు సమస్యలపై పోరాటం చేసి ప్రజల్లో ఆదరణ పొందాలని ప్రతిపక్ష నాయకులు చూస్తుంటే చిరంజీవి మాత్రం చాలా సున్నితంగా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు. శాసనసభలో ఆయన చేసిన ప్రసంగం కూడా పాము చావదు, కర్ర విరగదు అనే పద్ధతిలో ఉంది. పైగా, నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇదంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవి కొట్టేయాలనే ఉద్దేశంతోనే అంటున్నారు.