ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా కన్నా మెగాస్టార్ గానే చిరంజీవికి ఎక్కువ ఇమేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిని చూడడానికి ప్రజలు ఎగబడతారు. తమ హీరోను కళ్లారా చూసి ఆనందపడుతారు. కానీ, చిరంజీవికి సోమవారం సాయంత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన హీరో వర్షిప్ ఏ మాత్రం పనిచేయలేదు. హజ్ యాత్రికులను ఉద్దేశించి మాట్లడడానికి ఆయన వెళ్లారు. ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. ప్రసంగం సాగుతుండగానే అందరూ లేచిపోయారు. చిరంజీవి మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేసి వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతకన్నా చిరంజీవి అవమానం ఉంటుందా అనేది ముక్కు మీద వేలేసుకునేవారు లేకపోలేదు. అయితే, నమాజ్ కు వేళ కావడంతో అంతా వెళ్లిపోయారట. నమాజ్ కు వేళయితే దేని కోసమూ ఆగరనే విషయం తెలియంది కాదు.