అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మీది కోపాన్ని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మీద చూపిస్తున్నట్లున్నారు. ముఖ్యమంత్రి కావాలనే జగన్ ఆశలపై జెసి దివాకర్ రెడ్డి మొదటి నుంచీ నీళ్లు చల్లుతూనే ఉన్నారు. మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డితో జెసి దివాకర్ రెడ్డి, ప్రస్తుత తెలుగుదేశం నాయకుడు ఎంవి మైసురారెడ్డికి వైరం ఉంది. రాజశేఖర రెడ్డికి రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో మైసురారెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. జెసి మాత్రం అలాగే ఉంటూ వచ్చారు. ఒక రకంగా వైయస్ నాయకత్వాన్ని ఇష్టం లేకున్నా అంగీకరించారు. తొలి సారి జెసిని మంత్రివర్గంలోకి తీసుకున్న వైయస్ రెండోసారి మొండిచేయి చూపించారు. అయినా నోరు విప్పకుండా అలాగే ఉండిపోయారు. వైయస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి కావాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో జెసి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అంటారు. ముఖ్యమంత్రిగా రోశయ్యకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ వస్తున్నారు. చివరగా, జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయినా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం లేదని బహిరంగంగానే తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. జగన్ కు జెసి వంటి పెద్దల వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అదంతా వైయస్ నుంచి ఆనయకు వారసత్వంగా సంక్రమించిందే. పదవి కాకుండా వైయస్ నుంచి ఆయనకు అది అంది వచ్చింది. చేసుకున్నవారికి చేసుకున్నంత అంటే ఇదే.