కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ పట్ల మొయిలీ మెతగ్గా వ్యవహరిస్తున్నారని, ఒక రకంగా మొయిలీ జగన్ సైడ్ తీసుకుంటున్నారని ఆమె మండి పడుతున్నారట. మొయిలీని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆమె చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నప్పటికీ వివాదం రగులుతున్న సమయంలో అందుకు పూనుకుంటే మరో వివాదం నెత్తికి చుట్టుకుంటుందని ఆమె మానుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో మొయిలీని పక్కన జగన్ ను కట్టిడి చేసేందుకు నేరుగా సోనియానే నేరుగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ వివరాలు సేకరిస్తుండగా, చర్యలు మాత్రం స్వయంగా ఆమెనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా శాసనసభ్యులను ఢిల్లీకి పిలిపించడం, ప్రకాశం జిల్లా పార్లమెంటు సభ్యులతో మాట్లాడడం వంటి చర్యల ద్వారా జగన్ వ్యవహారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి సోనియా తీసుకున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. జగన్ ను కట్టడి చేసేందుకు ఆమె పకడ్బందీ వ్యూహాన్నే ఆనుసరిస్తున్నారు. అయితే ఆమె ఎత్తులు పారుతాయా అనేది వేచి చూడాల్సిందే.