చిరంజీవి నాయకత్వంలోని ప్రాజరాజ్యంలో మహిళా నాయకులు పోరు వీధికెక్కింది. పైకి వేరే రూపంలో కనిపిస్తున్నప్పటికీ మహిళా రాజ్యం మాజీ అధ్యక్షురాలు శోభారాణికి, ప్రజారాజ్యం నాయకురాలు వాసిరెడ్డి పద్మకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోందట. వాసిరెడ్డి పద్మ చిరంజీవికి దగ్గర కావడంతో గతంలో శోభారాణి ప్రాముఖ్యం తగ్గిందనే ప్రచారం జరిగింది. దీంతో శోభారాణి చిరంజీవి లేఖాస్త్రం సంధించారు. చిరంజీవిని కొంత మంది తప్పు దోవ పట్టిస్తున్నారని, సామాజిక న్యాయం అమలు కావడం లేదని ఆమె గగ్గోలు పెట్టారు. ఆ సమయంలో వాసిరెడ్డి పద్మ పార్టీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆ తర్వాత శోభారాణికి పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఇటీవల చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సినీ దంపతులు రాజశేఖర్, జీవితలపై ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ వెంట శోభారాణి ఉన్నారు. ఈ స్థితిలో వాసిరెడ్డి పద్మ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆమె పార్టీ క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారని భావిస్తున్నారు. శోభారాణి సామాజిక న్యాయం అమలు కావడం లేదంటే, అగ్రకులం పేర పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని వాసిరెడ్డి ఆడిపోసుకున్నారు. ఏమైనా, పార్టీలో ఇద్దరు మహిళల అంతర్గత పోరు మరో రూపంలో బయటపడుతోందని అంటున్నారు.