కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు ఆత్మీయుడు. కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహంగా ఉన్నా కూడా జగన్‌ను కాపాడుతూ వచ్చినట్లు మొయిలీ అపవాదులను కూడా ఎదుర్కున్నారు. వైయస్ జగన్ కు అండగా నిలవడానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేత కూడా మొయిలీ అక్షింతలు తిన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, వైయస్ జగన్‌కు మొయిలీ సహాయంతో సంతృప్తి చెందలేదని భావించాల్సి వస్తోంది. మొయిలీపై వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మొయిలీ ఒత్తిడి వల్లనే కృష్ణా ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగే విధంగా, కర్ణాటకకు లబ్ధి చేకూరే విధంగా తీర్పు వెలువరించందని ఆరోపించారు. మొయిలీ కర్ణాటకకు చెందినవారనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాలు చేతుల్లో ఉండడంతో. తమ భవిష్యత్తు మొయిలీ మీద ఆధారపడి ఉండడం వల్ల కాంగ్రెసు రాష్ట్ర నాయకులు కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకించడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మొయిలీకి భయపడి మాట్లాడడం లేదని విమర్సించింది. దీన్ని బట్టి వైయస్ జగన్ మొయిలీపై కూడా తన బాణాలను ఎక్కుపెడుతున్నారనే అనుకోవాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని ఆయన ఆచరణలో నిరూపిస్తున్నారు.