ఆంధ్రజ్యోతి ఎండితో చంద్రబాల 11 క్షణాల మాటలే

ఆ 11 క్షణాలు 'హలో అంటే హలో' అని... ఎవరు మీరు? అని తెలుసుకునేలోగా... కరిగిపోయే సమయమని ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యాఖ్యానించింది. ఇంత తక్కువ సమయంలో 'కుట్ర'లకు పాల్పడవచ్చా? 'మహా కుట్ర'ల్లో భాగస్వామి కావొచ్చా?జగన్ పార్టీ నేతలు, ఆయన మీడియా వండి వార్చిన కుట్ర సిద్ధాంతం ప్రకారం మాత్రమే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.
'ఎవరీ చంద్రబాల? సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు? ఆ వెంటనే మా వ్యతిరేకి అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో ఎందుకు మాట్లాడారు?' అంటూ ఇంత గొంతేసుకుని లేవనెత్తిన ప్రశ్నల్లో డొల్లతనం బయటపడింది. చంద్రబాల నుంచి రాధాకృష్ణకు మూడొందలకుపైగా కాల్స్ వెళ్లాయన్న జగన్ మీడియా కథనం ఒట్టి కట్టుకథ అని తేలిపోయిందని స్పష్టం చేసింది. వందలూ... పదులూ కాదు... ఒకే ఒక్కసారి, అది కూడా పదకొండు క్షణాలు మాత్రమే చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎండీతో మాట్లాడారు.
చంద్రబాల సెల్‌ఫోన్ నెంబర్‌కు సంబంధించి ఏప్రిల్ 20 - జూన్ 19వ తేదీ మధ్యకాలానికి సంబంధించిన కాల్‌లిస్టు ఆధారంగానే జగన్ మీడియా చిందులు తొక్కింది. దీనిని పరిశీలిస్తే... మే 23వ తేదీ ఉదయం 10.19 గంటలకు చంద్రబాల నుంచి ఆంధ్రజ్యోతి ఎండీకి కాల్ వచ్చింది. పదకొండు క్షణాల్లో అది ముగిసిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్తాకథనంలో బుధవారం వివరించింది.
నాచారం ఇన్స్‌పెక్టర్ ద్వారా జగన్ పత్రిక విలేకరే తప్పుడు పద్ధతుల్లో కాల్ లిస్టును సంపాదించారని బయటపడింది. తనకు గుర్తున్నంత వరకు రాధాకృష్ణకు రెండుసార్లు మాత్రమే ఫోన్ చేశానని, ఒకసారి ఫ్లైట్‌లో ఉన్నట్లు చెప్పగా, మరోసారి పది సెకన్లు మాత్రమే మాట్లాడానని చంద్రబాల 'ఏబీఎన్' చానల్‌లో జరిగిన చర్చలో స్పష్టం చేశారు. ఒకటిని వందలుగా చిత్రీకరించి కుట్ర సిద్ధాంతానికి తప్పుడు మసాలా జోడించడం జగన్ మీడియాకే చెల్లిందని ఆంధ్రజ్యోతి విమర్శించింది.












Click it and Unblock the Notifications