దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి

శనివారం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... బొగ్గు బ్లాకుల కేటాయింపులలో జరిగిన అవకతవకలకి దాసరి నారాయణ రావు కూడా బాధ్యుడే అని ఆరోపించారు. ఈ స్కాంలో ప్రధానితో పాటు నాటి బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దాసరి పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కోల్ బ్లాకులను కేటాయించే విషయంలో మార్పులు, చేర్పులపై సహాయ మంత్రి సూచనలు, సలహాలు ఇస్తుంటారని చెప్పారు.
బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో దాసరి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధానిని దాసరి పక్కదోవ పట్టించారని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 200కు పైగా కోల్ బ్లాక్ కేటాయింపులు జరిగాయని, వీటిలో దాసరి పాత్ర పైన దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని సమీక్షా సమావేశాలకు హాజరైంది దాసరి నారాయణ రావే అని గుర్తు చేస్తున్నారు. వేలం ద్వారా నష్టాలపై ప్రధానికి దాసరి లేఖలు రాశారని, తద్వారా వేలం ప్రతిపాదనలను నీరుగార్చారని ఆరోపణలు వస్తున్నాయి. దాసరి వైఖరిపై కోల్ సెక్రటరీ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ అవకతవకలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు కూడా దాసరిని తప్పు పట్టారు. బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణ రావు కుంభకోణం గురించి తనకేమీ తెలయదని అంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాగ్ వెలుగులోకి తెచ్చిన కుంభకోణాలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాను మంత్రిగా పోస్ట్‌మాన్ ఉద్యోగం మాత్రమే చేశానని దాసరి చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications