కిరణ్: అందుకే ధర్మాన రాజీనామాపై సస్పెన్స్

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా ధర్మాన రాజీనామాను ఆమోదించడం ఖాయమని, అధిష్ఠానం నుంచి కూడా అవే సంకేతాలు వచ్చాయని భావించినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం నెలకొంటోంది. ఈ అంశంలో వేచి చూసే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికే మోపిదేవి అరెస్టు నేపథ్యంలో తాజాగా ధర్మాన రాజీనామా ఆమోదిస్తే సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగిలిన నలుగురు మంత్రుల్లో ఆందోళనకు కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే దాదాపు 24 మంది మంత్రులు ముఖ్యమంత్రితో భేటీ అయి ధర్మాన రాజీనామా ఆమోదించవద్దని డిమాండ్ చేయడం కూడా తెలిసిందే.
ఈ నేపథ్యంలో వేచి చూసే ధోరణి మంచిదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ధర్మానను అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. సిబిఐ కూడా ఇదే ఆలోచనతో ఉందన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ఒకవేళ ఆ పరిస్థితే వచ్చినట్లయితే అప్పుడు రాజీనామాను ఆమోదించవచ్చన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు కనిపిస్తోంది. ధర్మాన రాజీనామా అంశంపై శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విలేఖరులు అడిగినపుడు త్వరలో మీరే చూస్తారు కదా అని చెప్పారు. ధర్మాన రాజీనామా ఆమోదించే అంశం, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చే అంశాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ఇందులో తొలుత రాజీనామా ఆమోదం అంశంపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక రాజీనామా అంశం కీలకంగా మారుతోంది. దీనిని కూడా కొద్ది రోజులు వాయిదా వేయాలని భావిస్తుండటంతో మిగిలిన మంత్రులలో ఎలాంటి అలజడి లేకుండా చూడవచ్చునని కిరణ్ భావిస్తున్నట్లుగా ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications