చంద్రబాబు ప్రకటిస్తే, వైయస్ జగన్‌పై ఒత్తిడి

బీసీ డిక్లరేషన్ ద్వారా ఇప్పటికే కొంత మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ అంశంపై జగన్‌పై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఉన్నారు. మరో అంశంపై కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇరకాటంలో పెట్టినట్లే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలపడం ద్వారా ఆ పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మాల నాయకుల ప్రాబల్యం ఉంది. దీంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా వైయస్ జగన్ నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. దీంతో ఎస్సీల్లోని మాదిగలను తన వైపు తిప్పుకోవడానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు.
అన్నింటి కన్నా ముఖ్యమైంది ఇప్పుడు తెలంగాణ అంశం. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారనే మాట వినిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇస్తే జగన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు తెలంగాణవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు ప్రకటన చేస్తే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే తమ నిర్ణయాలను వెల్లడించాల్సి ఉంటుంది.
చంద్రబాబు ప్రకటన చేస్తే అటు కాంగ్రెసు పార్టీయే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఇరకాటంలో పడి తమ వైఖరులను వెల్లడించాల్సిన అనివార్యతలో పడుతాయి. ఆ పార్టీలు తర్జనభర్జనలు చేసేలోగా తెలంగాణలో తమ బలాన్ని కూడగట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లభిస్తుంది. ఏమైనా, చంద్రబాబు అపర చాణుక్యుడనే విషయాన్ని మరోసారి నిరూపించుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications