'రాయల' అంతు చిక్కని 'టి': అసెంబ్లీలోను...

రాయల తెలంగాణ ద్వారా పలు పరిష్కారాలు దొరుకుతాయని అధిష్టానం భావిస్తోందట. అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినవారు. వీటిని తెలంగాణలో కలిపితేనే ప్రయోజనం ఉంటుందని, హైదరాబాద్ - బెంగళూరు మధ్య పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయడానికి వీలుగా రోడ్లు, రైలు మార్గాల అనుసంధానం అభివృద్ధికి వీలుంటుందని, విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడితే అనంతపురంల జిల్లాలోని పవన విద్యుత్ ఉత్పత్తి ద్వారా అధిగమించవచ్చునని, అలాగే అనంత, కర్నూలులోని సున్నపురాయి రాయల తెలంగాణకు సాయం చేస్తుందని, ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీటి ఇబ్బంది తప్పుతుందని భావిస్తోందట.
ఆ రెండు జిల్లాలను తెలంగాణలో కలిపితే రాజధాని సమస్య తీరడమే కాకుండా, ప్రత్యేక రాయలసీమ డిమాండు శాశ్వతంగా తెరపడుతుందని, అంతేకాకుండా కర్నులు, అనంతపురం జిల్లా ప్రజలు మూడు నుండి నాలుగు గంటల్లోనే రాజధాని హైదరాబాదుకు చేరుకుంటారని చెబుతున్నారు.
ఇక రాజకీయంగా తెరాస బలం పడిపోయి కాంగ్రెసు మరింత బలపడుతుందని అధిష్టానం భావిస్తోంది. అలాగే చంద్రబాబు, జగన్‌లు సీమాంధ్రకే పరిమితం కావడం వల్ల అక్కడకూడా క్రమంగా కాంగ్రెసు బలమైన శక్తిగా ఎదుగుతుందని భావిస్తున్నారట.
రాయల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతోంది. అసలు అధిష్ఠానం ఆలోచనేమిటో తెలియక తికమకకు కారణమవుతోంది. 'రాయల'తో ఒనగూరే ప్రయోజనాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. రాయలతో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమన్న ఆలోచన, ఆందోళన తొలగిపోయినట్లేనని, శ్రీశైలం ప్రాజెక్టు వివాదం సమసిపోతుందని, కుడి ఎడమ గట్లు, విద్యుత్తు ప్రాజెక్టులు ఒకే రాష్ట్రంలో ఉంటాయని, సాగు, తాగునీటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారట.
రాయల తెలంగాణ ద్వారా ప్రాంతాల సమీకరణలు మారి, రాయల విభజనకు అసెంబ్లీలోనూ సానుకూలత వ్యక్తమవుతుందంటున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో విభజనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు నచ్చజెప్పవచ్చునని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభించే వీలుందంటున్నారు. ఇప్పటికే రాయల తెలంగాణకు అంగీకరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదరకు జైరాం రమేష్ ఫోన్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications