బాబు స్టయిల్: విక్టరీ వదిలేసి, దండం పెడుతూ..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన శైలిని మార్చుకున్నారు. మనిషి మారినట్లుగా కనిపిస్తున్నారు. రెండు వేళ్లతో విక్టరీ సింబల్ చూపించే చంద్రబాబు ఇప్పుడు రెండు చేతులూ జోడించి దండం పెడుతున్నారు. ముఖంలో గాంభీర్యాన్ని వదిలేసి చిరునవ్వు చిందిస్తున్నారు. పాదయాత్రకు బయలుదేరినప్పటి నుంచే ఆయన శైలిని మార్చుకున్నప్పటికీ పాదయాత్ర పూర్తయ్యే సరికి అది సహజసిద్ధంగా వచ్చేసి స్థితికి చేరుకుంది.
హైటెక్ చంద్రబాబు అనే ముద్రను పోగొట్టుకుని ప్రజల మనిషిని అని చెప్పుకోవడానికి అవసరమైన శైలిని అలవరుచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కాను నలగనిచ్చేవారు కాదు. క్రాఫ్ కొద్దిగా కూడా చెదిరేది కాదు. నిత్యం నల్లగా నిగనిగలాడే బూట్లతో కనిపించేవారు. జన సమూహాలకు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడేవారు. దగ్గరికి వచ్చినవారి భుజంపై చేయి వేసి మాట్లాడే అలవాటు తక్కువగా ఉండేది.

కానీ, ఇప్పుడు బాబులో ఎన్నో మార్పులు. చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా పట్టించుకోవడం లేదు. పాదయాత్రలో తన వద్దకు వచ్చిన వారి భుజాలపై చేయి వేసి నడుస్తూ మాట్లాడుతున్నారు. గంభీరంగా ఉండాలని ప్రయత్నం చేయకుండా నవ్వుతూ వారితో కలిసి ప్రయత్నం చేస్తున్నారు.
పాదయాత్ర చేస్తూనే పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దే పనిచేస్తున్నారు. దాంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. అయినా సంయమనం పాటిస్తున్నారు. తీవ్రమైన కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉన్నా మొండిగా పాదయాత్ర చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications