జెసి తనయుడి ట్విస్ట్: చంద్రబాబు రాయబారం
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఇచ్చిన ట్విస్టుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. జెసి తనయుడు పవన్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో చంద్రబాబు జెసి దివాకర్ రెడ్డి వద్దకు చంద్రబాబు రాయబారిని పంపినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం జెసి సోదరులపై గట్టి విశ్వాసం పెట్టుకుంది. అయితే, ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని జెసి తనయుడు పవన్ కుమార్ రెడ్డి అంటూనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు కదులుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

దాంతో వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లకుండా జెసి సోదరుడిని, తనయుడిని నిలువరించాలనే ప్రయత్నంలో చంద్రబాబు పడినట్లు చెబుతున్నారు. అందుకు చంద్రబాబు ఆదివారం రాత్రి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌ను జెసి దివాకర్ రెడ్డి వద్దకు రాయబారిగా పంపినట్లు తెలుస్తోంది.
అనంతపురం లోకసభ సీటును ప్రభాకర్ రెడ్డికి, తాడిపత్రి శాసనసభ స్థానాన్ని జెసి కుమారుడికి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వేరే పార్టీకి వెళ్లే ఆలోచన మానుకోవాలని రమేష్ జెసి దివాకర్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని, తన సోదరుడూ కుమారుడితో మాట్లాడి విషయం చెబుతానని జెసి దివాకర్ రెడ్డి కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications