కిరణ్ నో చెప్తే చంద్రబాబు, జగన్‌లపై చిరు అస్త్రం

జగన్ కొత్త కుంపటి పెట్టుకున్నాక సీమాంధ్రలో పార్టీ ఇబ్బందుల్లో పడటం, తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలోనే ఒక్క ప్రాంతంలోనేనా పట్టు కోసం కాంగ్రెసు విభజన వైపు మొగ్గు చూపిందనే వాదన ఉంది. సీమాంధ్రలోను ఎన్నికల వరకు కోలుకోవచ్చునని భావిస్తోంది. అందుకే విభజన వైపు మొగ్గుచూపింది. విభజన నేపథ్యంలో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా అధిష్టానంలో ఉంది.
సీమాంధ్ర విషయానికి వస్తే జగన్‌ను ధీటుగా ఎదుర్కొనే నేతను ముఖ్యమంత్రి బరిలో నిలపాలను చూస్తోందట. 2014 ఎన్నికల్లో జగన్‌ను ఫేస్ చేయాలంటే చిరు మాస్ అట్రాక్షన్ ఉన్న లీడర్ వల్లనే సాధ్యమని భావిస్తోందట. దీనిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోనప్పటికీ చర్చలు మాత్రం సాగుతున్నాయట. ప్రస్తుతం విభజనపై దృష్టి సారించిన అధిష్టానం, ఆ తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఇందులో మరో కోణం కూడా ఉంది. విభజనపై అసంతృప్తితో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. విభజన తర్వాత సిఎంగా ఉండేందుకు కిరణ్ అంగీకరించని పక్షంలో వెంటనే చిరు వైపు మొగ్గుచూపుతారని అంటున్నారు. 2014 ఎన్నికలలో మాత్రం చిరంజీవినే ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. చిరును సిఎం అభ్యర్థిగా చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున కాంగ్రెసు వైపు మళ్లుతాయని భావిస్తున్నారట.
విశాఖ, అరకు, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ తదితర నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. చిరంజీవిని సిఎంగా చేస్తామంటే 2014 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు పార్టీల మధ్యనే హోరాహోరీగా ఉండే అవకాశముందంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో కమ్మ, మరికొన్ని ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది. విభజనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొద్దిగా దెబ్బతినవచ్చునని చెబుతున్నారు. అయితే రాయలసీమ, ఎస్పీఎస్ నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలో ఆ పార్టీ బలంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుందని, మూడు పార్టీల మధ్య హోరాహోరీ ఉంటుందని కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications