బాబు యాత్ర చిచ్చు: కాంగ్రెసు వైపు మోత్కుపల్లి?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సీమాంధ్ర ఆత్మగౌరవ యాత్ర ఆ పార్టీ తెలంగాణ నేతల్లో అభద్రతా భావాన్ని పెంచి పోషించినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఏళ్ల తరబడి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్రలో పర్యటిస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో తెలంగాణ నేతలు తమ దారి తాము చూసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజనను ఆపలేని స్థితిలో చంద్రబాబు సమైక్య నినాదాల వల్ల తెలంగాణలో తమకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోత్కుపల్లి ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.

ముఖ్యమంత్రి తాను ఎందుకు భేటీ అయ్యాననే విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, గెలిచే పరిస్థితి లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, చంద్రబాబు సీమాంధ్ర యాత్రతో తమ భవిష్యత్తు మరింత దారుణంగా మారే పరిస్థితి ఉందని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరే అవకాశం మోత్కుపల్లి నర్సింహులుకు లేదు. తెరాస నాయకులపై, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కుటుంబ సభ్యులపై మోత్కుపల్లి తీవ్రంగా విరుచుకుపడుతూ వచ్చారు. పైగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస కాంగ్రెసులో విలీనమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెసులో చేరి వచ్చే ఎన్నికలకు బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications