ఏలూరుపై లగడపాటి కన్ను,బిజెపిలోకి పురంధేశ్వరి?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు తదితరులు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. దగ్గుబాటి దంపతులతో పాటు లగడపాటి, రాయపాటి వంటి వారు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమంటున్నారు.
లగడపాటి ఇప్పటికే బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ఆశతో ఆయన మొదటి నుండి ఉన్నారు. కిరణ్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో... ఆయన పార్టీ పెట్టకుంటే అనే కోణంలో ఆలోచించి ఇప్పటికే ప్రత్యామ్నాయాల పైన దృష్టి సారించారట. అందులో భాగంగా బిజెపితో టచ్‌లో ఉన్నారంటున్నారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావుకూడా నరసారావుపేట నుండి బిజెపి తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ ఎంపీలు తెలుగుదేశం పార్టీతోను చర్చలు జరుపుతున్నారట.

మరోవైపు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పలువురు నేతలు బిజెపి వైపు చూస్తున్నారని రెండు రోజుల క్రితం చెప్పారు. కేంద్రమంత్రులు కూడా బిజెపిలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో బలంగా ఉన్న పలువురు నేతలు, కేంద్రమంత్రులు తమ పార్టీలోకి వస్తారని స్థానిక బిజెపి నాయకులు చెబుతున్నారట.
ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు కూడా బిజెపిలో చేరే అవకాశాలు లేకపోలేదని బిజెపి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. 2014 ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు స్థానిక బిజెపి తీవ్రంగా కృషి చేస్తోంది. నగరాల్లో ఉన్న మోడీ హవా కూడా అక్కడ వీస్తోంది. దీనికి తోడు తాను విశాఖను వదిలేది లేదని పురంధేశ్వరి ఇటీవల చెప్పారు. అక్కడ ఆమెకు టి సుబ్బిరామి రెడ్డి నుండి కాంగ్రెసు టిక్కెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో కేంద్రమంత్రుల్లో పురంధేశ్వరి బిజెపి వైపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపిలు కలిసి పోటీ చేస్తే గుంటూరు లోకసభ స్థానాన్ని అడగాలని బిజెపి స్థానిక నాయకత్వం భావిస్తోంది. గుంటూరు లోకసభకు బిజెపి తరఫున నూజివీడు సీడ్స్ ప్రభాకర్ చౌదరి బరిలో దిగేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రస్తుతం విజయవాడ నుండి ఎంపీగా ఉన్న లగడపాటి కన్ను ఇప్పుడు ఏలూరు పైన పడిందంటున్నారు. టిడిపి తరఫున విజయవాడకు కేశినేని నాని బరిలో నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications