ఆపరేషన్ 'సన్': ఆ ఇద్దరిపై జగన్ కన్ను

ఇటీవల జరిగిన సహకార ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపిలో దూకుడు కొంత పెరిగింది. ఈ దూకుడును వలసల వ్యూహంతో తిప్పికొట్టాలని జగన్ పార్టీ భావిస్తోందట. టిడిపి ఇటు సీమాంధ్రలో అటు తెలంగాణలో క్రమంగా పుంజుకుంటోంది. గతంలో దెబ్బతిన్న టిడిపి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వంటి చోట్ల జగన్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది. అదే సమయంలో బాబు పాదయాత్ర టిడిపిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉండాలంటే కాంగ్రెసు పార్టీ కంటే ఇప్పుడు టిడిపిని టార్గెట్‌గా పెట్టుకోవడమే మంచిదనే భావనలో జగన్ పార్టీ ఉందట. కాంగ్రెసు నేతల వైపు దృష్టి సారించినా టిడిపిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారట. ఆయా జిల్లాలకు చెందిన పలువురికి గాలం వేసే పనిలో పెట్టారట. తెలంగాణలోను టిడిపికి గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. సహకారం తర్వాత ఓ ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ జగన్ పార్టీకి జై కొట్టారు.
టిడిపి సీనియర్లు అయ్యన్నపాత్రుడు, ఉమామాధవ రెడ్డిలపై జగన్ శిబిరం కన్నేసిందట. దీంతో వారి తనయులతో చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తోందట. తనయుల ద్వారా ఈ సీనియర్లను తమ వైపుకు రప్పించే ప్రయత్నాలు చేస్తోందట. అయితే, అయ్యన్న, ఉమ వంటి నేతల నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదట. జగన్ పార్టీ ఎంతగా ప్రయత్నించినా వారు పార్టీని వీడేందుకు ఆసక్తి చూపే అవకాశాలు లేవంటున్నారు.












Click it and Unblock the Notifications