బాలయ్య ఫ్యాన్స్ హంగామా: పురంధేశ్వరి భవిష్యత్తు?
హైదరాబాద్: నందమూరి హీరో బాలకృష్ణ అభిమానుల హంగామా వెనక ఆయన సోదరి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తు వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పురంధేశ్వరిని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావును తెలుగుదేశం పార్టీలోకి తేవడానికి బాలయ్యకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని డిమాండ్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు పార్టీలోకి వస్తే, నందమూరి హరికృష్ణ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలుంటాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాలయ్య నియామకం జరిగితే పార్టీ వ్యవహారాలు కూడా చేతుల్లోకి వస్తాయి. దీనివల్ల బాలయ్య నిర్ణయాలే అమలవుతూ వస్తాయి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గౌరవంగా నిలబెడుతూనే నందమూరి కుటుంబ సభ్యులు తమ పని తాము చేసుకుని పోవడానికి వీలు కలుగుతుంది.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పురంధేశ్వరి మౌనంగా ఉంటున్నారు. ఆమె ఏమీ మాట్లాడడం లేదు. ఆమె ఏం చేస్తారనే విషయంపై కూడా తెలియడం లేదు. దగ్గుబాటి దంపతులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి.
చంద్రబాబు నాయుడు హరికృష్ణను కూడా పార్టీకి దూరంగా పెట్టారు. వియ్యంకుడు కూడా అయిన బాలకృష్ణను పార్లమెంటుకు గానీ, అసెంబ్లీకి పోటీ చేయించి అంత వరకే పరిమితం చేయాలని చూస్తున్నారు. కానీ, బాలకృష్ణ అంతకు మించిన పాత్రను పార్టీలో కోరుతున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఏ దిశగా నడిపిస్తాయో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications