జైశ్రీరాం, జై శివాజీ: అసెంబ్లీలో బీజేపీ, శివసేన పోటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. అయితే, పెద్ద ఎత్తున నినాదాలతో ఈ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. రెండున్నర దశాబ్దాలుగా కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేసాయి.
శివసేన ఎమ్మెల్యేలు సభకు హాజరు కాగానే జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు జై శ్రీరాం అంటూ నినదించారు.
కాగా, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై శివసేన చెప్పాల్సి ఉంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో గెలుపొందింది. శివసేన 65 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ అధికారం చేపట్టాలంటే మరో ఇరవైకి పైగా సీట్లు తక్కువ పడుతున్నాయి.
దీంతో శివసేన మద్దతు ఇస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఈ నెల 12న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో తన మద్దతు లేనిదే ఫడ్నవీస్ గెలవలేరన్న ధీమాతో ఉన్న శివసేన, అధికార పక్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ధాటిగా సమాధానమిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

మోడీకి సేన స్వస్తి?
బీజేపీ - శివసేన మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఆదివారం మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా శివసేన ఎంపీ అనీల్ దేశాయ్ ఆదివారం పదవీ స్వీకార ప్రమాణం చేయకుండా వాకౌట్ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మోడీ సర్కార్ నుంచి వైదొలగడంతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాల్లో కూర్చోడానికీ వెనుకాడేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంకేతాలు అందించారు.
తమ మనుగడ కోసం ఎన్సీపీ మద్దతు స్వీకరించేందుకు ఫడ్నవీస్ సర్కార్ ప్రయత్నిస్తే మహారాష్ట్రలో తాము విపక్షంగా మారుతామని ఆదివారం సాయంత్రం ముంబైలో జరిగిన శాసన సభాపక్ష సమావేశం అనంతరం ఉద్ధవ్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని ఫడ్నవీస్ మంత్రివర్గంలో తమకు ఇచ్చే శాఖల సంఖ్యను ఆదివారంలోగా తేల్చాలని బీజేపీ హైకమాండ్‌కు శివసేన రెండు రోజుల క్రితమే అల్టిమేటం ఇచ్చింది.
ఇప్పటికీ ఆ వ్యవహారాన్ని తేల్చనందుకు నిరసనగానే కేంద్ర కేబినెట్‌లో చేరకుండానే అనీల్ దేశాయ్ వెనక్కి వెళ్లి పోయారనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రభు, అనీల్ దేశాయ్‌ల కేబినెట్ బెర్త్ విషయంతో రగడ రాజుకుందనే వాదనలు కూడా వినిపించాయి. ప్రస్తుతం మోడీ సర్కార్‌లో ఉన్న తమ ఏకైక ప్రతినిధి అనంత గీతేను రాజీనామా చేయాలని సేన నాయకత్వం కోరే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications