మైనంపల్లి తిప్పలు: సైకిల్ కాదు, కారు
హైదరాబాద్: మైనంపల్లి హనుమంతరావు సైకిల్ దిగి కారు ఎక్కారు. ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. దీంతో తాను పోటీ చేస్తున్న మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం జై తెలంగాణ నినాదాలు చేస్తూ, కారు గుర్తును ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
మైనంపల్లి హనుమంతరావును మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం ప్రజలు సైకిల్ గుర్తుతోనే ఎక్కువగా గుర్తిస్తారు. గతంలో రెండు సార్లు మల్కాజిగిరి శాసనసభా నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తుపై గెలిచారు. దాంతో ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు పడేలా చూడడానికి మైనంపల్లి అనుచరులు తిప్పలు పడుతున్నారు.

నిజానికి తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, అయితే మల్కాజిగిరి శాసనసభ టికెట్ తనకు మళ్లీ ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, అయితే ఆ సీటును బిజెపికి కేటాయించారని, తాను తెరాస నుంచి పోటీ చేస్తానని ఏ రోజు కూడా అనుకోలేదని మైనంపల్లి అంటున్నారట.
మల్కాజిగిరి లోకసభ స్థానంలో ఆయన లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణను, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిహెచ్ మల్లారెడ్డిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డిని ఎదుర్కుంటున్నారు. మైనంపల్లి ఈ నియోజకవర్గంలో చెమటోడ్చక తప్పదు.












Click it and Unblock the Notifications