ఓటుకు నోటు దుమారం: జగన్‍ను బుజ్జగించారా?
హైదరాబాద్: నోటుకు ఓటుపై సభా కార్యక్రమాలను స్తంభింపజేయవద్దని నచ్చజెప్పడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ వద్దకు బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజును రాయబారిగా పంపినట్లు తెలుస్తోంది. అయితే, జగన్ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ కారణంగానే శుక్రవారంనాడు సభా కార్యక్రమాలు జరగకుండానే స్పీకర్ నిరవదికంగా వాయిదా వేసినట్లు సమాచారం.
శుక్రవారంనాడు సభ ప్రారంభమైన వెంటనే నోటుకు ఓటుపై చర్చించాలంటూ వైఎస్ జగన్ పట్టుపట్టడంతో రెండు దఫాలుగా వాయిదా పడింది. సభను గాడిలో పెట్టేందుకు స్పీకర్ మధ్యవర్తిగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజును వైఎస్ జగన్ వద్దకు పంపి చర్చలు జరిపారు. దాదాపు అర్ధగంటపాటు జగన్‌తో సమావేశమైన విష్ణుకుమార్‌రాజు జగన్ వినడం లేదని, చర్చ చేయాల్సిందేనని పట్టుపడుతున్నాడని స్పీకర్‌కు తెలియజేశారు.

మూడోసారి ప్రారంభమైన సమావేశంలో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు చేరి ఓటుకు రూ.5 కోట్లు అంటూ నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, జయనాగేశ్వర్‌రావు శాసనసభా హక్కుల ఉల్లంఘన కింద కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి, వైసీపీ సభ్యులకు నోటీసులిచ్చారు. వీటిని ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తున్నట్లు చెప్పిన స్పీకర్ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, తన ఛేంబర్‌లోనే ఉండి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభకు రాలేదు. ఓటుకు నోటు అంశం సభను కుదిపేస్తుంటే సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఉండి సమావేశాలను తిలకించారే తప్ప సభకు హాజరు కాలేదు. . సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే అసెంబ్లీ కమ్యూనిటీహాల్‌లో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశానికి చంద్రబాబు హాజరవ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications