సాక్షి: విజయవాడలో భూమికొన్న చంద్రబాబు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడ సమీపంలో నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు సాక్షి దినపత్రిక ఆన్‌లైన్ పోర్టల్‌లో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం.. విజయవాడ పోరంకి సమీపంలో ఈ స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఈ స్థలంలో నివాస గృహంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనం నిర్మించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు సమాచారం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ భూమిని చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున కొన్నట్లు ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి.
సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని భావించినా.. తాత్కాలికంగా కొంత సమయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. విజయవాడ లోకసభ సభ్యుడు, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని సంస్థకు చెందిన బస్సులు నిలిపే స్థలం సమీపంలో కొత్త ఆటోనగర్ నుంచి ఎనికేపాడు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ భూమి ఉంది.

ఇక్కడ ఎకరా మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు పలుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం పోరంకి గ్రామ పరిధిలోకి వస్తుందని, అయితే ఖచ్చితంగా ఎప్పుడు కొనుగోలు చేసింది తెలియదని టిడిపి స్థానిక నాయకుడొకరు తెలిపారు. పార్టీ ఏపి శాఖకు ప్రత్యేకంగా కార్యాలయం నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ స్థలం కొనుగోలు చేశారని ఆయన చెప్పారు.
కాగా, విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించేందుకు ఇటీవల లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వాస్తు సరిగా లేదని చంద్రబాబు వ్యక్తిగత సిద్ధాంతి రాఘవయ్య తేల్చినట్లు సమాచారం. రాత్రిపూట అందులో బస చేయవద్దని చెప్పినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు ఇటీవలి కాలంలో విజయవాడలో రాత్రిపూట బసచేస్తే హోటళ్లలోనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications