కర్ణాటక పోలీసులకు చిక్కిన తెలంగాణ ఎస్ఐ తుపాకీ
హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ సబ్ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) తన తుపాకీ(సర్వీస్ రివాల్వర్)ని కర్ణాటక రాష్ట్రంలో పోగొట్టుకున్నారు. అయితే ఆ తుపాకీ కర్ణాటక పోలీసులకు చిక్కింది.
విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు.. సదరు తుపాకీని ఆ ఎస్ఐకి అందజేశారు. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. తుపాకీ కాపాడుకోలేని కారణంగా ఉన్నతాధికారులు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు.
వివరాల్లోకెళితే... నల్గొండ జిల్లా పెన్ పహాడ్ ఎస్సైగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి సెప్టెంబర్ 29న కర్ణాటక సరిహద్దులోని మైసమ్మ ఆలయానికి వెళ్లారు. బయట పార్కు చేసిన తన వాహనంపై రివాల్వర్ ఉంచి ఆలయం లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

ఈ క్రమంలో అక్కడి భక్తులు రివాల్వర్ చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెనువెంటనే రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
ఆ తుపాకీ కూడా పోలీస్ సర్వీస్ రివాల్వరేనని నిర్ధారించుకుని తిరిగి శంకర్ రెడ్డికి ఇచ్చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన శంకర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
దీనిపై సమాచారం అందుకున్న నల్గొండ జిల్లా ఎస్పీ విక్రం జిత్ దుగ్గల్ రివాల్వర్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన శంకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications