తిరుమలలో తలనీలాలు: మహిళా క్షురకులు భేష్
తిరుపతి: తిరుమలలోని శ్రీవారి ప్రధాన కల్యాణకట్టలో సోమవారం నిర్వహించిన సామర్థ్యం పరీక్షల్లో మహిళా క్షురకులు విశేష ప్రతిభ కనపరిచారు. వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో విచ్చేసి మహిళా భక్తులకు, చంటిబిడ్డలకు తలనీలాలు తీసేందుకు వీరి సేవలు వినియోగించుకోవడానికి టిటిడి సామర్థ్యపు పరీక్షలు నిర్వహించింది.
శ్రీవారి సేవ పథకం కింద ఈ మహిళా క్షురకులు ఉచితంగా తమ సేవలు అందించి భగవంతుని కృపను అందుకోనున్నారని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1వతేది నుండి మహిళా కల్యాణకట్ట సేవకుల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం టిటిడి నిబంధనల ప్రకారం వందమంది సేవకులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించామన్నారు.

వందశాతం హాజరైన మహిళా సేవకులు తలనీలాలు తీయడంలో ప్రతిభ కనపరిచారని, ఏప్రిల్ ఒకటవ తేది నుండి విడతల వారీగా వీరి సేవలను టిటిడి వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా వచ్చేవేసవిని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి భక్తులు విడిది చేసే వసతి సముదాయాల్లో (పిఎసిల్లో)సౌకర్యాలు పెంచాలని అధికారులను టిటిడి ఇఓ సాంబశివరావు ఆదేశించారు.












Click it and Unblock the Notifications