ఓట్ల లెక్కింపు: బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?
పాట్నా: నెలరోజుల పాటు ఐదు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 32 స్థానాల్లో ఎన్టీఏ, 12 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యంలో ఉంది.
దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్టీఏ కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారనే అంశంపై ఆ రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. అనుభవజ్ఞుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎన్నికలకు ముందు వినిపించింది.
అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు రొహతాస్ జిల్లా దినార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజేంద్రసింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జార్ఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా 2013లో ఆయన ఎన్నికయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేసిన దినార నియోజకవర్గం నుంచి గెలుస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఎందుకంటే అక్కడ ఆయనపై నితీష్ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న జయ్‌కుమార్ సింగ్ జేడీయూ అభ్యర్థిగా పోటీ చేశారు. జయ్‌కుమార్ సింగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న పేరు బీజేపీ గయ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్.
ప్రేమ్‌కుమార్ బిహార్ అసెంబ్లీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కావడంతో పాటు 1990 నుంచి ఇప్పటివరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఓడిపోలేదు. బలహీనవర్గాలకు చెందిన ఆయనే కాబోయే ముఖ్యమంత్రంటూ గయ పోలింగ్‌కు రెండు రోజుల ముందు బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ప్రకటించారు.
కాగా, ప్రేమ్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ప్రియరంజన్ పోటీచేశారు. ఇక ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న నందకిషోర్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇంతవరకు ఓడిపోలేదు. ఆరెస్సెస్ కార్యకర్త. నరేంద్ర మోడీకి కాస్త సన్నిహితులు.
అదేవిధంగా మోడీకి అత్యంత సన్నిహితులు, బలహీనవర్గానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ చౌరాసియా పేరు కూడా వినిపిస్తోంది. వీరందరిలో బీహార్ ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీశ్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications