పదే పదే బాబు పేరు: పురంధేశ్వరికి 'ఇరానీ' చిక్కులు
విజయవాడ: మనకు నచ్చనివారి పేరును పదే పదే ప్రస్తావించడానికి మనకు ఇష్టం ఉండదు. వారి పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు మనసుకు కష్టంగా కూడా ఉంటుంది. అటువంటి చిక్కుల్లోనే బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పడ్డారు. తనకు అంతగా ఇష్టంలేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరును పదే పదే ప్రస్తావించాల్సి వచ్చింది.
కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ కారణంగా ఆమె ఆ చిక్కులు తప్పలేదు. బిజెపి రెండేళ్ల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా 'వికాస్ పర్వ్' పేరుతో బిజెపి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విజయవాడలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆమె హిందీ ప్రసంగాన్ని పురంధేశ్వరి తెలుగులోకి అనువదించాల్సి వచ్చింది. బిజెపి, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు కావడంతో స్మృతి ఇరానీ తన ప్రసంగాన్ని చంద్రబాబు పాలన, ఆయన దీక్షాదక్షతలపై ఫోకస్ చేశారు. చంద్రబాబు, మోడీ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేయడానికి నడుంబిగించాయని అన్నారు.

చంద్రబాబు కృషిపై ప్రశంస
దేశాభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి శ్లాఘనీయమని స్మృతి ఇరానీ అన్నారు. ఆమె ప్రతి వాక్యంలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ వచ్చారు.

పురంధేశ్వరి ఇబ్బంది
చంద్రబాబు పేరును ప్రస్తావించడానికి పురంధేశ్వరి చాలా ఇబ్బంది పడ్డారు. నాలుగైదుసార్లు ఇరానీ, చంద్రబాబు పేరును ప్రస్తావించగా పురంధేశ్వరి ఒక్కసారే ఆయన పేరును ప్రస్తావించారు. మిగిలిన సమయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ అనువాదాన్ని కొనసాగించారు.

ఇరకాటంలో పురంధేశ్వరి
చంద్రబాబు పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని పురంధేశ్వరితో ఆయన పేరును పదేపదే ఉచ్చరించేలా ఇరానీ ఇరకాటంలో పడేసింది.

అంతటితో ఆగకుండా..
చంద్రబాబు పేరును ప్రస్తావించడంతో ఇరానీ ఆగలేదు. యుపిఎ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వం ఆనాలోచిత విధానాలను అవలంబించిందని, స్వలాభం కోసమే పనిచేశారని, వారు పాలించిన పదేళ్ళలో ఏనాడూ ప్రజల ముందుకు వచ్చి పాలన నివేదికను ఇవ్వలేకపోయారని విమర్శించారు.

ఇది కూడా..
యుపిఎ ప్రభుత్వంపై చేసిన విమర్శనలు కూడా పురంధేశ్వరి తెలుగులోకి అనువదించాల్సి వచ్చింది. విజ్ఞత కలిగిన పురంధేశ్వరి పదవిలో ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు కూడా పరులను దూషించలేదు.

పురంధేశ్వరి పద్ధతి ఇదీ..
పురంధేశ్వరి ఎప్పుడు కూడా ప్రభుత్వాలను విమర్శించలేదు. అదే ఆమె గతంలో తను పనిచేసిన ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పరిస్థితిలో పడ్డారు.

తారుమారు ఇలా...
గత యుపిఎ ప్రభుత్వంలో మానవవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి అదే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తన నోటి వెంట చెప్పాల్సి రావడం ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి.

స్మృతి ఇరానీ ఇలా....
యుపిఎ ప్రభుత్వ పాలనలో దగ్గుబాటి పురంధేశ్వరి మానవ వనరుల శాఖను నిర్వహించారు. ఇప్పుడు ఎన్డీయె పాలనలో ఆ శాఖ స్మృతి ఇరానీ చేతికి వచ్చింది.












Click it and Unblock the Notifications