మెదడును కబలిస్తున్న అరుదైన ఫంగస్.. ఆందోళన కలిగిస్తున్న ప్రాణాంతక కేసులు!
మానవ మెదడుపై దాడి చేసే ఓ అరుదైన, ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని సైంటిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత దశాబ్ధ కాలంలో 'క్లాడోఫియాలోఫోరా బాంటియానా' అనే ఫంగస్ సోకిన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సైంటిస్టులు ఈ కేసులపై అధ్యయన చేయగా.. ముఖ్యంగా 2023 నుంచి ఈ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగినట్లు వెల్లడైంది. అయితే ఈ ఫంగస్ మనుషులకు ఎలా సోకుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో దీని పెరుగుదలకు అసలు కారణాలు ఏమిటనేది అంతుచిక్కుకుండా ఉంది.
"ఈ అసాధారణ పెరుగుదలకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు" అని సీడీసీకి చెందిన "మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ రిపోర్టు"లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో రచయితలు పేర్కొన్నారు. సాధారణంగా మానవులలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒకవేళ ఇవి మెదడును చేరినా అది శరీరంలోని వేరే ప్రాంతంలో ఉన్న మరో వ్యాధి తాలూకు ప్రభావం వల్ల జరుగుతుంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారే ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అయితే 'క్లాడోఫియాలోఫోరా బాంటియానా' మాత్రం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికే కాకుండా, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా సోకుతుండటం గమనార్హం. ఈ బాధితుల్లో దాదాపు సగం మంది ఆరోగ్యంగా ఉన్నవారే కావడం విశేషం. దీని ప్రధాన లక్ష్యం మెదడే కావడం విశేషం. మెదడులోకి ప్రవేశించి ఈ ఫంగస్ చీముతో నిండిన గడ్డలను సృష్టిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకితే మరణాల రేటు ఏకంగా 60 నుంచి 70 శాతం వరకు ఉంటుందని పరిశోధనా రచయిత జోషువా లీబర్‌మన్ వెల్లడించారు. అంతే కాకుండా ఇది ఎవరినైనా సరే వదలదని, ఈ ఫంగస్ బారిన పడిన రోగుల్లో దాదాపు సగం మంది ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేని, పటిష్టమైన రోగినిరోధక శక్తి ఉన్నవారే కావడం గమనార్హం.
ఈ అంశంపై స్పష్టత కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రత్యేక క్లినికల్ రిఫరెన్స్ ల్యాబ్ డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అనుమానిత ఫంగల్ మెదడు ఇన్ఫెక్షన్లకు వచ్చిన మొత్తం నమూనాలతో పాజిటివ్ శాంపిల్స్ సంఖ్యను బేరీజు వేసి ఈ గణాంకాలను సేకరించారు. 2009 జనవరి నుంచి 2026 జులై మధ్య కాలం 21 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ పరిధిలో 48 నిర్ధారిత కేసులు, ఒక అనుమానిత కేసుతో మొత్తం 49 కేసులు వెలుగుచూశాయి. 2009 నుంచి 2023 వరకు ప్రతి ఏటా కేవలం 1 నుంచి 5 కేసులు మాత్రమే నమోదు కాగా.. 2024 నాటికి ఈ సంఖ్య 8కి, 2025 నాటికి ఏకంగా 14కి ఎగబాకింది.
ఈ ఇన్ఫెక్షన్ ఉద్ధృతి 2017లోనే ప్రారంభమైనప్పటికీ.. 2021 నాటికి మరింత స్పష్టంగా బయటపడింది. 2017 నుంచి 2023 మధ్య వెయ్యి నమూనాలకు సగటున 8.4 కేసులు రాగా.. 2023 నుంచి 2025 మధ్య ఈ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. 1911లోనే తొలిసారిగా మెదడు గడ్డలో ఈ ఫంగస్‌ను గుర్తించినప్పటికీ.. నేటికీ దీని గురించి సైంటిస్టులకు పూర్తి సమాచారం లేదు. అసలు ఇది ప్రకృతిలో ఎక్కడ నివసిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. చర్మం ద్వారా లేదా శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుకుంటుందని భావిస్తున్నప్పటికీ.. సంక్రమణ మార్గం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. ఆరోగ్యంగా ఉన్నవారే దీనికి ఎందుకు బలి అవుతున్నారనే ప్రశ్న అలాగే ఉంది. ఏదేమైనా కేసుల పెరుగుదలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి క్రమబద్ధమైన డేటా సేకరణ అవసరమని స్పష్టం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
