కంది పచ్చడి.. ఇలా చేస్తే తినకుండా ఉండలేరు!
మనం రోజూ ఎన్ని రకాల కూరలు వండుకు తిన్నా పచ్చడితో తింటే ఉండే ఆనందమే వేరు. సహజంగా పచ్చళ్ళ ప్రియులు రకరకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. రొటీన్ కి భిన్నంగా కంది పచ్చడి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. కంది పచ్చడి అనేది ఆంధ్రా, తెలంగాణలో చాలా ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ పచ్చడి. కందిపప్పు, వెల్లుల్లి, కారం, ఉప్పుతో చేసే ఈ పచ్చడి అన్నం, దోశ, ఇడ్లీతో చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు
కంది పప్పు - ½ కప్పు
ఎండు మిరపకాయలు - 6-8
వెల్లుల్లి రెబ్బలు - 8-10
చింతపండు- చిన్న ఉసిరి కాయంత
ఉప్పు - తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్ (వేయించటానికి)
నూనె - 1 టేబుల్ స్పూన్( తాలింపుకి)
ఆవాలు - ½ టీ స్పూన్
జీలకర్ర - ½ టీ స్పూన్
పచ్చి శనగపప్పు - ½ టీ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఎండు మిరపకాయ - 1-2 (ముక్కలు చేసి)
ఇంగువ - చిటికెడు

తయారీ విధానం
బాణలిలో కొంచెం నూనె వేసి కంది పప్పును మధ్యమైన మంట మీద లేత బంగారు రంగు వచ్చేలా వేయించండి. పప్పు ముదురు రంగు రాకుండా జాగ్రత్త వహించండి. బాగా ఎక్కువ వేగితే కందిపప్పు చేదు వస్తుంది. కనుక మధ్యస్తంగా వేయించండి. వేయించిన పప్పును పక్కన పెట్టండి. అదే బాణలిలో ఎండు మిరపకాయలు, చింతపండు వేసి వేయించండి.
కంది పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఆపై చల్లారిన పప్పు, మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిని మిక్సీలో వేసి ఉప్పు, జీలకర్ర, కరివేపాకు కలిపి మెత్తగా రుబ్బుకోండి. కాస్త నీళ్లు పోసి మిక్సీ చెయ్యండి. బాగా ఎక్కువ నీరు పోస్తే పచ్చడి పలచగా అవుతుంది. అది అంత బాగోదు. కనుక పచ్చడి నలగటానికి కావలసిన నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యండి.
అన్నంలో అయినా టిఫిన్స్ లో అయినా అదుర్స్
ఆపై చిన్న బాణలిలో నూనె వేడి చేసి పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు చేసి పచ్చడి మీద పోయండి. బాగా కలపండి. ఈ పచ్చడి అన్నం లో అయినా, దోశ, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టుతో కూడా బాగుంటుంది. నెయ్యి కలిపి తింటే ఇంకా రుచి పెరుగుతుంది.













Click it and Unblock the Notifications