పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు!
ఇటీవల కాలంలో మళ్ళీ పొట్టు ఉన్న ఆహారమే బలం అన్న అభిప్రాయం వచ్చింది. ఇప్పటివరకు పొట్టు తీసిన మినపగుళ్ళు చాయమినపప్పు వచ్చాయి కానీ మళ్ళీ ఇప్పుడుపొట్టు పప్పులు దొరుకుతున్నాయి. పాత కాలంలో వంటలలోకి పోపులలోకి అందరూ పొట్టుతో ఉన్న మినపప్పునే వాడేవారు.అలాంటి పొట్టు మినపప్పుతో మనం అనేకరకాల వంటలే కాదు పచ్చడి కూడా చేసుకోవచ్చు.
పొట్టు మినప్పప్పుతో రోటి పచ్చడి
సహజంగా గారెలు వేయడానికి , మనకు కావాల్సిన అల్పాహారాలు తయారు చేసుకోవటానికి, మినపసున్ని ఉండలు తయారు చేయడానికి కూడా మినపప్పును ఉపయోగించేవారు. ఇక పొట్టు మినపప్పు ఉపయోగించడం వలన శరీరానికి అవసరమైన ఐరన్ సమకూరుతుంది . ఇప్పుడు పొట్టు మినపప్పు తో రోటిపచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసినవి
పొట్టు మినపప్పు - 50 గ్రాములు .
ఎండుమిరపకాయలు - 12
జీలకర్ర -స్పూను.
చింతపండు - చిన్న సైజు నిమ్మకాయంత . ( సుమారు 20 గ్రాములు..విడదీసి పావు గ్లాసు నీళ్ళలో పావు గంట ముందు నానబెట్టుకోవాలి)
నెయ్యి - మూడు స్పూన్లు
ఇంగువ -కొద్దిగా
ఉప్పు - తగినంత
బెల్లం - చిన్న ముక్క ( ఇష్టం అయితేనే)
పోపు -ఇష్టాన్ని బట్టి
తయారీ విధానము
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి మూడుస్పూన్లు నెయ్యి వేసి , నెయ్యి బాగా వేడి అయిన తర్వాత పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర మరియు ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోవాలి .చల్లారగానే రోటిలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకుని , చింతపండును తడిపిన నీళ్ళతో సహా , తగినంత ఉప్పు మరియు చిన్న బెల్లం ముక్కను వేసి కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ రుబ్బాలి.
ఇలా చేస్తే సూపర్ టేస్ట్
మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు తగిలే విధముగా రోట్లో రుబ్బుకోవాలి .ఒకవేళ మిక్సీలో వేసినా సరే కొద్దిగా బరగ్గా వేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .ఈ పచ్చడిలో మళ్ళీ అవసరం అనిపిస్తే పోపు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇలాగే తినేయొచ్చు.ఈ పచ్చడి నాలుగు రోజులు నిల్వ ఉంటుంది ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యకరమైన పొట్టు మినపప్పుతో చేసే ఈ పచ్చడి తిని మీరే చెప్తారు. ఇది చాలా స్పెషల్ అని.












Click it and Unblock the Notifications