ఇంట్లోనే ఈజీగా ధాబా స్టైల్ "పంజాబీ చికెన్".. ఎలా చేయాలంటే ???
భారతదేశంలో చికెన్ కర్రీ అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. తెలుగులో కోడి కూరగా పిలుచుకుంటాం. ఒక్కో ప్రాంతంలో ఒక్క రకంగా ఈ వంటకాన్ని ప్రిపేర్ చేసినా కానీ.. చిన్నారు నుంచి పెద్దల వరకు దీన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్ ఫ్రై, బటర్ చికెన్, కడాయి చికెన్, నాటు కోడి కూర ఇలా ఏ వెరైటీ అయినా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం స్పైసీగా చికెన్ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ తినడంలో మాత్రం తగ్గేదే లే అంటుంటారు.
ఇక చికెన్ లోనే పంజాబీ చికెన్ కూడా ఒక సపరేట్ స్టైల్ అని చెప్పాలి. సాధారణంగానే పంజాబీ వంటకాల్లో మాంసాహారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అధిక పాల ఉత్పత్తి కారణంగా వారి వంటకాల్లో వెన్న (బటర్), పెరుగు (దహి), క్రీమ్ ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల చికెన్ వంటకాలు మరింత చిక్కగా, క్రీమీగా రుచిగా ఉంటాయి. అందుకే ఆ తరహా స్టైల్ ఇష్టపడే వారికి పంజాబీ చికెన్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇక ధాబా స్టైల్ పంజాబీ చికెన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అందుకే ధాభా మేకింగ్ స్టైల్లో పంజాబీ చికెన్ ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

పంజాబీ చికెన్ కర్రీ రెసిపీ..
కావలసిన పదార్థాలు:
- చికెన్ - ½ కిలో
- ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
- టమాటాలు - 2 (పేస్ట్ చేసుకోవాలి లేదా సన్నగా తరిగినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
- పెరుగు - ½ కప్పు
- పసుపు - ¼ టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్ (రుచికి తగ్గట్టు)
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - ½ టీ స్పూన్
- జీలకర్ర పొడి - ½ టీ స్పూన్
- ఉప్పు - తగినంత
- నెయ్యి లేదా నూనె - 3 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - తగినంత (తరిగినది)
- వెన్న - 1 టేబుల్ స్పూన్ (ఐచ్చికం)
చికెన్ మెరినేట్ చేయడం:
చికెన్ ముక్కలను పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలాతో కలిపి 30 నిమిషాలు పక్కన ఉంచాలి.
తయారీ విధానం..
- కడాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం వేయించాలి.
- తరువాత టమాటా పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలా నూనె వదిలే వరకు వండాలి.
- మెరినేట్ చేసిన చికెన్‌ను ఈ మసాలాలో వేసి బాగా కలపాలి.
- 5-6 నిమిషాలు మంట ఎక్కువగా పెట్టి చికెన్ నూనె వదిలే వరకు వండాలి.
- కావలసినంత నీరు (సగం కప్పు వరకు) వేసి, మూత పెట్టి మధ్యమ మంటపై 20-25 నిమిషాలు చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.
- చివర్లో గరం మసాలా, వెన్న వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి.
- చివరగా కొత్తిమీర చల్లి దించాలి.












Click it and Unblock the Notifications