Prostate Cancer: పురుషులకు ప్రాణసంకటంగా ప్రొస్టేట్ క్యాన్సర్.. ప్రతి 8 మందిలో ఒకరికి ఛాన్స్
Men Health: క్యాన్సర్‌ను చాలా భయంకరమైన రోగంగా భావిస్తారు. కానీ ప్రారంభ దశలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడిన చాలామంది పురుషులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలరు. కుటుంబం కోసం పాటుపడే క్రమంలో మగవారు తమ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అదే వారి పాలిట శాపంగా మారుతుంది. సమయానుగుణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రోత్సహిస్తే ఈ తరహా క్యాన్సర్స్ నుంచి తప్పించవచ్చు.
సీమెన్ తయారుచేసే చిన్న గ్రంథికి వచ్చే క్యాన్సర్‌ను ప్రొస్టేట్ క్యాన్సర్ గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో దీన్ని ఒకటిగా పరిగణిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరికి వారి జీవితకాలంలో ఈ క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 60 శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు 65 ఏళ్లు పైబడినవారిలో కనుగొనబడ్డాయి. 2020లో 1.4 మిలియన్ కొత్త కేసులు గుర్తించగా, 2040 నాటికి ఈ సంఖ్య 2.9 మిలియన్‌కు పెరగనుందని అంచనా.

కానీ ప్రారంభ దశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. 80-85 శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ప్రారంభ దశలలోనే గుర్తించబడతాయి. అప్పుడే చికిత్స పొందిన పురుషుల్లో చాలా మంది ఐదేళ్ల తర్వాత ఈ వ్యాధి నుంచి విముక్తి పొందుతారు. అనంతరం దాదాపు 95 శాతం మందికి 15 ఏళ్లు జీవించే అవకాశం ఉంది.
ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులలో 5-10 శాతం వంశపారంపర్యంగా సంక్రమించేవే. తండ్రి లేదా సోదరుడికి ఈ వ్యాధి ఉంటే ఆ వ్యక్తి దీని బారిన పడే అవకాశం రెట్టింపు అవుతుంది. అయితే జన్యు పరీక్షలలో పురోగతి, క్యాన్సర్ గురించి విశ్లేషణ దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. డిసైఫర్ వంటి పరీక్షలు 22 జన్యువుల కార్యకలాపాలను విశ్లేషించి, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశాన్ని అంచనా వేస్తాయి. తద్వారా పరిస్థితి తీవ్రతరం కాకుండా అడ్డుకునే అవకాశం లభిస్తుంది. తదనుగుణంగా వైద్యుల సలహాలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని క్రమంగా మెరుగుపరచుకోవచ్చు.












Click it and Unblock the Notifications