భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఇలా చేయండి?
మనిషి సనాతనమైన జీవి. ప్రతి మనిషి దైవంతో సమానమని, నాలో నిన్ను చూడు.. నీలో నన్ను చూడు అని దేవుడు నిరంతరం చెబుతూనే ఉంటాడు. కానీ మనం చెవికెక్కించుకోం కదా. భగవంతుడు అంటే దేవాలయాల్లోను, తిరుపతిలో, శ్రీశైలంలోను, షిరిడిలోను ఉన్నాడనుకుంటే అంతకంటే అమాయకత్వం మరేమీ ఉండదు. ప్రతి మనిషిలోను దైవత్వం ఉంది. దాన్ని గుర్తిస్తే ఆ మనిషే దేవుడు.

నిలువెల్లా నిండిన స్వార్థం
కానీ మనలో నిలువెల్లా నిండిపోయి స్వార్థం, సంకుచితత్వంవల్ల మన పరిధిని మనమే కుచించుకుంటాం. విశాలమైన ఈ ప్రపంచంలో మన మనసు మరింత విశాలంగా ఉండాలి. కానీ ఏనాడైనా అలా ఉందా? అని మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? లేదు. మన గురించి మనం కనీసం రోజులో ఒకసారి ప్రశ్నించుకుంటే లోపాలన్నీ తెలుస్తాయి. ప్రతి చిన్న కష్టానికి దేవుడి దయ లేదంటూ మన అజ్ఞానాన్ని చాటుకుంటాం. ఆయన దయ మనపై ఎప్పుడూ.. మన భాషలో చెప్పాలంటే 7 రోజులు.. 24 గంటలు ఉంటుంది.

అంతర్యామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి
మన వేలికో, కాలికో వచ్చిన చిన్న బాధను గుర్తిస్తున్నామే కాని మిగిలిన శరీరమంతా బాగుందన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అలాగే దైవం మనపై చూపించే అపార కరుణను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం కావడంలేదు అంటే మీరు జీవితానికి ఒక గురువును ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం విద్యనభ్యసించే సమయంలో పాఠాలు చెప్పే గురువులు ఎలా ఉంటారో.. మన జీవితానికి కూడా అలాగే ఒక గురువుండాలి. చివరకు ఒక కట్టె పుల్లను, లేదంటే ఎండు గడ్డిపరకనైనా నువ్వు గురువుగా భావించి చూడు.. గురువు మాటను జవదాటకుండా ఉండు.. అప్పుడు తెలుస్తుంది నీకు భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు.. నాలో ఉన్నాడు.. నీలో ఉన్నాడు అని అర్థమవుతుంది.

దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది
దైవానుగ్రహం నిరంతరం మనపై ప్రసరిస్తూనే ఉంటుంది. సృష్టి మొత్తం సర్వవ్యాపి అయి ఉన్నాడు. మనసు పోకడలకు, శరీర ధర్మాలకు భిన్నంగా ఉండాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు కష్టనష్టాలు, సుఖదుఖాలు సమాంతరంగా చూడటం అలవడుతుందో అప్పుడు మీకు సమదృష్టి వస్తుంది. మనలో స్థిరంగా నిలిచివున్న దైవం స్పష్టంగా దర్శనమిస్తుంది.












Click it and Unblock the Notifications