వాస్తు ప్రకారం.. ఇంట్లో అక్వేరియం విషయంలో పాటించాల్సినవి
ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, వాస్తు దోషాలను తొలగించడానికి వాస్తు శాస్త్రంలో అనేక రకాలైన మార్గాలు అందుబాటులో ఉంటోన్నాయి. ఫిష్ అక్వేరియం ఒకటి. అక్వేరియం నీరు, చేపల నిరంతర కదలికలు ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేసి, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇంటి అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత, అభివృద్ధిని చేకూరుస్తాయి
వాస్తు శాస్త్రం ప్రకారం పంచభూతాలలో ఒకటైన నీటికి జీవకళను ఆకర్షించే గుణం ఉంటుంది. అక్వేరియంలో నిరంతరం కదిలే నీరు జీవితంలో నిరంతర ఎదుగుదల, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. చేపల కదలికలు ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంపొందిస్తాయి. చెడు దృష్టిని ఈ అక్వేరియం తన వైపునకు తిప్పుకుని, ఇంటిని రక్షిస్తుందని నమ్ముతారు. ఇంట్లో అక్వేరియాన్ని అమర్చే విధానం, దిక్కులు.. ముఖ్యం.

ఇంట్లో లివింగ్ రూమ్‌లోని నైరుతి దిక్కున అక్వేరియం అమర్చడానికి అత్యంత అనుకూల ప్రదేశంగా పరిగణిస్తారు. రెండో ప్రత్యామ్నాయం ఉత్తర లేదా ఈశాన్య దిశలు. వాస్తు ప్రకారం ఈశాన్యం అనేది జలానికి సంబంధించినది కావడం వల్ల ఈ దిశలో అక్వేరియం ఉంచితే ఆకస్మిక ధనలాభం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున అక్వేరియంను అమర్చడం వల్ల దంపతుల మధ్య ప్రేమానురాగాలు, బంధం మరింత బలపడతాయి.
ఆఫీస్, దుకాణాలు, ఇతర వ్యాపార స్థలాల్లో రిసెప్షన్ ఏరియాలో ఉత్తరం లేదా తూర్పు దిశలలో అక్వేరియాన్ని అమర్చడం వల్ల వ్యాపార వృద్ధి వేగవంతమౌతుంది. ఉద్యోగుల పని ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుందనే విశ్వాసం ఉంది. అక్వేరియంను అమర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి దక్షిణ దిశలో ఉంచకూడదు. దక్షిణ దిశ.. అగ్ని మూలకానికి ప్రతీక. అక్కడ నీటిని ఉంచడం వల్ల సమతుల్యత దెబ్బతింటుంది.
నేరుగా సూర్యరశ్మి పడేలా కిటికీల దగ్గర అక్వేరియాన్ని ఉంచకూడదు. అలాగే.. ఏసీ లేదా రేడియేటర్ల వంటి పరికరాల వద్ద కూడా దీన్ని అమర్చకూడదు. టీవీ లేదా మ్యూజిక్ సిస్టమ్స్ వంటి శబ్ద కాలుష్యం ఉండే చోట చేపలు ఒత్తిడికి గురవుతాయి. అక్వేరియం గోడలపై నాచు పేరుకుపోకుండా క్రమం తప్పకుండా నీటిని మారుస్తూ శుభ్రం చేయాలి. మురికి నీటిని అలాగే ఉంచకూడదు. అక్వేరియం అద్దం పగిలినా, నీరు కారుతున్నా దానిని వెంటనే సరిచేయాలి. వాటిని అలాగే ఉంచితే కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది.
వాస్తు నియమాల ప్రకారం అక్వేరియంలో చేపల సంఖ్య బేసి సంఖ్యలోనే ఉండాలి. ముఖ్యంగా తొమ్మిది చేపలను ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. వీటిలో ఎనిమిది గోల్డ్ ఫిష్ లేదా డ్రాగన్ ఫిష్, ఒకటి ఖచ్చితంగా బ్లాక్ ఫిష్ ఉండాలి. నలుపు రంగు చేప ఇంట్లో ప్రతికూల శక్తి, దుష్టశక్తులను తన వైపునకు లాక్కుని నశింపజేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే కొన్నిసార్లు నలుపు చేపలు త్వరగా మరణిస్తుంటాయి.
అక్వేరియంలో చేపలు పిల్లలను కనడం వాస్తు పరంగా అపారమైన శ్రేయస్సుకు సంకేతం. ఇది ఆ ఇంట్లో సంతోషం, జీవకళ వర్ధిల్లుతున్నాయని చెప్పడానికి నిదర్శనం. చేపలకు క్రమం తప్పకుండా ఆహారం అందించడం వల్ల మంచి కర్మా ఫలాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత గోధుమ రవ్వ లేదా చేపల మేత వేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.















Click it and Unblock the Notifications
